క్షమాపణలు చెప్పినా వదిలిపెట్ట.. అస్సాం సీఎంపై రాహుల్‌ గాంధీ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ల్యాండ్ ఏటీఎం కుంభకోణంపై విచారణ జరిపిస్తామని, ఆయనను వదిలేది లేదని హెచ్చరించారు.

క్షమాపణలు చెప్పినా వదిలిపెట్ట.. అస్సాం సీఎంపై రాహుల్‌ గాంధీ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్ చేసినట్టే అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను మోడీ, అమిత్ షా కంట్రోల్ చేస్తున్నారని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అదానీ కంపెనీ పేరును మోదానీ అని పెట్టాలని సెటైర్ వేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ క్షమాపణలు కోరినా ఆయన్ను వదిలిపెట్టబోయేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాంలోని బిశ్వనాథ్‌ చరియాలీలో నిర్వహించిన ప్రచార సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. హిమంతను దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రిగా అభివర్ణించిన ఆయన.. తాము అధికారంలోకి వచ్చాక ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ల్యాండ్ ఏటీఎం కుంభకోణం:

మోడీ, అమిత్ షా అండతో హిమంత అసోంలో 'ల్యాండ్ ఏటీఎం' సృష్టించారని రాహుల్ ఆరోపించారు. ప్రజల నుంచి భూములను లాక్కుని బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దాదాపు 98,400 బిఘాల భూమిని మూడు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేశారని విమర్శించారు. కేవలం ముఖ్యమంత్రినే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులపై ఉన్న అవినీతి ఆరోపణలపై కూడా విచారణ జరిపిస్తామని రాహుల్ పేర్కొన్నారు. ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అస్సాం ప్రజలను ఏకం చేసేందుకు తన జీవితాంతం కృషి చేశారని, కాంగ్రెస్ సిద్ధాంతం కూడా అదేనని రాహుల్ అన్నారు. బీజేపీ సమాజంలో విద్వేషాన్ని పంపుతోందని, కాంగ్రెస్ మాత్రం ప్రేమను పంచుతుందని తెలిపారు. అస్సాంను ఢిల్లీ నుంచి పాలించాలని బీజేపీ చూస్తోందని, కానీ అధికారాన్ని వికేంద్రీకరించాలని కాంగ్రెస్ నమ్ముతోందన్నారు.

Next Story