ఇండియా-యూఎస్ డీల్ వెనుక ఎప్‍స్టీన్ సెక్స్ ఫైల్స్ లింకు?

by Prasad Jukanti |   (  Updated:2026-02-03 11:19:48  IST  )

యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్‌కు అనూహ్యంగా గ్రీన్ సిగ్నల్ రావడంతో జాతీయ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

ఇండియా-యూఎస్ డీల్  వెనుక ఎప్‍స్టీన్ సెక్స్ ఫైల్స్ లింకు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూఎస్-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ (US India Trade Deal) విషయంలో ఎట్టకేలకు ముందడుగు పడింది. తన మాట వినని దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్ (Donald Trump) తాజాగా భారత్‍పై వెనక్కి తగ్గారు. వాణిజ్య ఒప్పందానికి ఓకే చెబుతూ ఇండియాపై సుంకాల్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు మోడీ తనకు గొప్ప స్నేహితుడు అంటూ ప్రశంసలు కురిపించారు. ఇంత వరకు బాగానే ఉన్న గత పెండింగ్‍లో ఉన్న ఈ డీల్‍కు అనూహ్యంగా పచ్చజెండా ఊగిపోవడం, ఇరు దేశాధినేతలు ప్రకటనలు చేయడం జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే ఈ వాణిజ్య ఒప్పందం వెనుక పెద్ద తతంగమే నడిచిందని దీని వెనుకా చాలా పెద్ద లోగుట్టు ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

యూఎస్ డీల్‍ వెనుక ఎప్‍స్టిన్ ఫైల్స్ లింక్?:

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వెనుక అమెరికాను కుదిపేస్తున్న ఎప్‍స్టిన్ సెక్స్ కుంభకోణం పాత్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ డీల్‍పై తాజా స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ.. అమెరికాకు దేశాన్ని అమ్మేశారు. నాలుగు నెలలుగా నిలిచిన ఒప్పందంపై మోడీ ఇప్పుడు సంతకం చేయాల్సి వచ్చింది. నిజానికి ఈ సంతకం చేయాలని అమెరికా నుండి మోడీపై తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఈ ఒత్తిడి వల్లే మోడీ రాజీపడ్డారు. అమెరికాలో అదానీపై కేసు ఉంది. వాస్తవానికి అది మోడీపై పెట్టాల్సిన కేసు. అలాగే అమెరికా బయటపెట్టని ఎప్‍స్టీన్ ఫైల్స్ లో చాలా విషయాలున్నాయి. ఎప్‍స్టిన్ ఫైల్స్ విషయంలో మోడీపై చాలా ఒత్తిడి ఉంది అందువల్లే మోడీ రాజీ పడ్డారని ఆరోపించారు. మోడీ దేశ ప్రజల కష్టాన్ని అమెరికాకు కట్టబెట్టడం వెనుక జరుగుతున్నదాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలతో యూఎస్- ఇండియా డీల్ వెనుక ఎప్‍స్టిన్ ఫైల్స్ లింక్ ఉందా అనే చర్చ జరుగుతోంది.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోడీ పేరు!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎప్‍స్టిన్ ఫైల్స్ (Epstein Files) సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. లైంగిక నేరాలకు పాల్పడిన నిందితుడు, అమెరికా వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‍స్టీన్‍కు సంబంధించిన ఈఫైల్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక ఈమెయిల్ లో ఎప్‍స్టిన్ మోడీ పేరును ప్రస్తావించారని 2017 జులై 4న మోడీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని అంశాల్ని ఈ ఈమెయిల్‍లో ఎప్‍స్టిన్ ప్రస్తవిచినట్లు ప్రచారం జరుగుతోంది. 2017లో ట్రంప్ మోడీ భేటీ జరిగిందని అప్పుడు ట్రంప్ మోడీని ఇజ్రాయెల్ లో పర్యటించాలని సూచించారని ఈ సూచన మేరకే ఆ ఏడాది మోడీ ఇజ్రాయెల్ లో పర్యటించారని ఆ మెయిల్ లో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పర్యటనలో ట్రంప్ సూచనల మేరకే మోడీ వ్యవహారశైలి కొనసాగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జాతీయ రాజకీయాల్లో దుమారం:

అయితే ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోడీ పేరు ఉందనే ప్రచారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. సెక్స్ స్కాంలో ఇరుక్కున్న ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోడీ పేరు ఉన్నందున ఆయన తన ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ ఫైల్స్ కు అమెరికాతో డీల్ కు సంబంధం ఉందనేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంతో జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.

Next Story