EPFO ఆటో సెటిల్మెంట్ అంటే ఏంటి? దాని వల్ల ఎవరెవరికి బెనిఫిట్ ?

by Naga Rani Yarlagadda |

ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) తమ సభ్యులకు శుభవార్త చెప్పింది. అత్యవసర అవసరాలపై ముందస్తు ఉపసంహరణలకు సంబంధించిన ఆటో సెటిల్‌మెంట్‌ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది.

EPFO ఆటో సెటిల్మెంట్ అంటే ఏంటి? దాని వల్ల ఎవరెవరికి బెనిఫిట్ ?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) తమ సభ్యులకు శుభవార్త చెప్పింది. అత్యవసర అవసరాలపై ముందస్తు ఉపసంహరణలకు సంబంధించిన ఆటో సెటిల్‌మెంట్‌ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీంతో చందాదారులు రూ.5 లక్షల వరకు ఆన్‌లైన్ క్లెయిమ్‌లను వేగంగా, జోక్యం లేకుండా పొందవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఆటో సెటిల్‌మెంట్ విధానాన్ని ఇప్పుడు మరింత విస్తరించినట్లు తెలిపారు.

ఆటో సెటిల్‌మెంట్ అంటే ఏమిటి?

ఇది ఒక రకమైన డిజిటల్ క్లెయిమ్ ప్రాసెసింగ్ విధానం. ఇందులో మానవ జోక్యం ఉండదు. సభ్యుడి కేవైసీ పూర్తి, బ్యాంక్ ఖాతా ధృవీకరణ ఉన్నట్లయితే, ఐటీ సిస్టమ్‌ ద్వారా 3-4 రోజుల్లోగా క్లెయిమ్ ప్రాసెస్ చేయబడుతుంది. దీనివల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ సమయం 10 రోజుల నుంచి 3-4 రోజులకు తగ్గుతుంది.

ఏయే అవసరాలకు ఆటో సెటిల్‌మెంట్ వర్తిస్తుంది?

వైద్య ఖర్చులు – Rule 68J

వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్సల కోసం విత్‌డ్రా చేసుకోవచ్చు

అవసరమైన సందర్భాల్లో డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి

6 నెలల బేసిక్+DA లేదా సభ్యుడి వాటా (వడ్డీతో సహా)లో ఏది తక్కువైతే అంత వరకు ఉపసంహరణ

పెళ్లి, విద్య – Rule 68K

సభ్యుడి లేదా కుటుంబ సభ్యుల పెళ్లి, పిల్లల చదువులకు

EPFOలో 7 ఏళ్లు సభ్యత్వం పూర్తయినవారికి మాత్రమే

గరిష్ఠంగా మూడు సార్లు మాత్రమే 50% వరకు ఉపసంహరణ

వివాహానికి డిక్లరేషన్, విద్యకు సర్టిఫికెట్ అవసరం

ఇంటి కొనుగోలు/నిర్మాణం – Rule 68B

స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణం లేదా మరమ్మతులకు

EPFOలో కనీసం 5 సంవత్సరాలు సభ్యత్వం ఉండాలి

గరిష్ఠంగా రెండు సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు

ఫారమ్ 31ను ఆన్‌లైన్‌లో సమర్పించాలి

ఈ విధానం ద్వారా అత్యవసర సమయాల్లో సభ్యులు వేగంగా నిధులు పొందే అవకాశం ఉంది. ఆటో సెటిల్‌మెంట్ పరిధి పెరగడం EPF సభ్యుల కోసం సౌకర్యవంతమైన, వేగవంతమైన పరిష్కారం కానుంది.

Next Story