- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాపిడో డ్రైవర్ అకౌంట్లో రూ.331 కోట్లు.. ప్రజలకు ఈడీ కీలక సూచనలు
రాపిడో డ్రైవర్ కు చెందిన బ్యాంక్ అకౌంట్లో రూ.331 కోట్ల నగదు ఉన్నట్లు ఈడీ గుర్తించింది.

దిశ, వెబ్‌డెస్క్: రాపిడో డ్రైవర్ కు చెందిన బ్యాంక్ అకౌంట్లో రూ.331 కోట్ల నగదు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. గుజరాత్ కు చెందిన యువ రాజకీయ నేత ఆదిత్య జులా పెళ్లికి ఆ అకౌంట్ నుంచి కోటి రూపాయల వరకూ నిధులు అందినట్లుగా ఈడీ కనుగొంది. గతేడాది నవంబర్ లో ఉదయపూర్ లోని తాజ్ ఆరావళి రిసార్ట్ లో జరిగిన ఆదిత్య జులా డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఈ స్థాయిలో నిధులు అందడం పై ప్రశ్నలు తలెత్తాయి. 1xBet అక్రమ బెట్టింగ్ రాకెట్ పై దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈడీ ఈ విషయాలను గుర్తించింది. బెట్టింగ్ రాకెట్ ముసుగులో జరిగిన మనీలాండరింగ్ గుట్టు రట్టు చేసింది.
2024 ఆగస్టు నుంచి 2025 ఏప్రిల్ మధ్య కాలంలో రాపిడో డ్రైవర్ అకౌంట్ లో రూ.331.36 కోట్లు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆ అకౌంట్ నుంచి ఆదిత్య జులా ఆడంబరమైన పెళ్లికి ఖర్చుల కోసం డబ్బును వాడారు. ఆ పెళ్లి జంటతో రాపిడో డ్రైవర్ కు ఎలాంటి సంబంధం లేదని తేలడంతో.. అతడి బ్యాంక్ ఖాతాను మ్యూల్ అకౌంట్ గా వాడినట్లు ఈడీ భావిస్తోంది.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నగదు డిపాజిట్ కావడం, ఆపై వేరే ఖాతాలకు ట్రాన్స్ఫర్ కావడాన్ని పరిశీలించిన ఈడీ.. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు తేల్చింది. బెట్టింగ్ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో దాచేందుకే ఇలా మ్యూల్ అకౌంట్లను వాడినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజలకు ఈడీ పలు సూచనలు చేసింది.
మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, డెబిట్ / క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ వంటి వాటిని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. అలాగే గుర్తు తెలియని వ్యక్తుల కోసం చెక్కులు, ఇతర ఆర్థిక పత్రాలపై సంతకాలు చేయవద్దని కోరింది. అకౌంట్లో అనుమానాస్పదంగా డిపాజిట్లు, విత్ డ్రాలు జరిగితే వెంటనే బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఆర్థికంగా మీ గుర్తింపును వాడుకునేందుకు ఎవరైనా డబ్బు ఆశ చూపితే జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని సూచించింది. tafcop.sancharsaathi.gov.in పోర్టల్ లో మీ పేరుపై ఉన్న ఫోన్ నంబర్లను చెక్ చేసి, వాటిలో వాడని నంబర్లను డియాక్టివేట్ చేయాలని తెలిపారు.






