ఆందోళనలు, హైడ్రామా‌కు ఎండ్ కార్డ్.. కాంగ్రెస్ నేతలకు ECI అపాయింట్‌మెంట్

by Kema Shiva Kumar |

ఆందోళనలు, హైడ్రామా‌కు ఎండ్ కార్డ్.. కాంగ్రెస్ నేతలకు ECI అపాయింట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కార్యాలయం ఎటు కాంగ్రెస్ సీనియర్ నేతల ఆందోళనలు, హైడ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రతినిధి బృందానికి కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఈసీ సెక్రటేరియట్ అధికారికంగా ఓ లేఖను విడుదల చేసింది. రేపు ఢిల్లీలోని అశోకా రోడ్డులో గల నిర్వాచన్ సదన్ (కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం)లో మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో ఈసీ సమావేశం కానుంది.

వివరాలు కోరిన ఎన్నికల సంఘం..

అయితే, ఈ సమావేశానికి సంబంధించి అవసరమైన భద్రత, ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం ఈసీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీకి కొన్ని సూచనలు చేసింది. భేటీకి హాజరయ్యే ప్రతినిధి బృందంలోని సభ్యుల పేర్లు, వారితో పాటు వచ్చే వాహనాల వివరాలను తక్షణమే [email protected] అనే ఈమెయిల్ ఐడీకి పంపాల్సిందిగా ఈసీ సెక్రటరీ అశ్విని కుమార్ మొహల్ విడుదల చేసిన లేఖలో కోరారు. మరోవైపు ఈసీ కార్యాలయం గేట్లకు తాళాలు వేసి అడ్డుకున్నారంటూ జైరాం రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే, ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి వారి అపాయింట్‌మెంట్ ఇవ్వడం గమనార్హం.

Next Story