Udhampur: ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్

by S Gopi |

ఖచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా సైన్యం, పోలీసులు గురువారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ ప్రారంభించా..

Udhampur: ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మరో వారం రోజుల్లో అమర్‌నాథ్ యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్‌లో ఉన్న కురు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఆపరేషన్ బిహాలి అనే కోడ్‌నేమ్‌తో జరిగిన ఎన్‌కౌంటర్ గురించి భద్రతా దళాలు వివరాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని.. ఆర్మీ, పోలీసుల సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగానే తాజా ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు వెల్లడించారు. ఖచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా సైన్యం, పోలీసులు గురువారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ ప్రారంభించాయని జమ్మూ జోన్ ఐజీపీ భీమ్ సేన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ కాల్పుల్లో జైష్-ఎ-మొహమ్మద్ (జేఎం) ఉగ్రవాది హతమయ్యాడు. మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పొగమంచు ఉన్నప్పటికీ గాలింపులు కొనసాగుతున్నాయని, ముగ్గురు ఉగ్రవాదులు బసంత్‌గఢ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో దాక్కున్నట్టు గుర్తించామన్నారు. కాగా, వచ్చే నెల 3 నుంచి ఆగష్టు 9వ తేదీ వరకు జరిగే అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి వారం రోజుల ముందు ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. ఈ యాత్ర కోసం పెద్ద సంఖ్యలో యాత్రికులు అమర్‌నాథ్ మందిరానికి తరలివస్తారని భావిస్తున్నారు. ఈ నెల 25న భద్రతా దళాలు అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాల్లో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని గండేర్‌బాల్‌లో బాల్టాల్ బెస్ క్యాంప్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు. గండేర్‌బాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) పర్యవేక్షణలో ఈ మాక్‌డ్రిల్ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండు నెలల తర్వాత ఉధంపూర్ జిల్లాలోని బిహాలి ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.

Next Story