గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |

వరుస ఎన్‌కౌంటర్లతో సతమతమవుతోన్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస ఎన్‌కౌంటర్లతో సతమతమవుతోన్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహరాష్ట్రలోని గడ్చరోలి జిల్లా పరిధిలోని జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఎటపల్లి తాలూకాలోని మొడస్కే గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గట్టా లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ (LOS)కు చెందిన మావోయిస్టులు కొందరు క్యాంప్ వేసినట్లుగా బుధవారం ఉదయం సమయంలో సమాచారం అందింది. దీంతో అహెరీ నుంచి పోలీసులు, గడ్చిరోలి పోలీసులు సీ-60 స్పెషల్ యాంటీ నక్సల్ కమాండో బృందం ఐదు యూనిట్లతో కలిసి కూబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. మరోవైపు కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగం (CRPF) కార్డన్ ఏర్పాటు చేసి ఆపరేషన్‌కు కొ-ఆర్డినేట్ చేసింది.

అయితే, సీ-60 టీమ్ అడవిలో జల్లెడ పడుతుండగా.. వారిపైకి మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా పోలీసులు కౌంటర్ అటాక్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు తీవ్రమైన బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఘటనా స్థలంలో ఓ ఆటోమేటిక్ ఏకే-47 రైఫిల్, అధునాతన పిస్టల్‌తో పాటు భారీగా మందుగుండ సామగ్రి, నక్సల్ విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లుగా స్పెషల్ యాంటీ నక్సల్ కమాండ్ టీమ్ స్పష్టం చేసింది. మొడస్కే గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Next Story