మనుషులకు ఉద్యోగాలుండవ్..ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్

by Phanindra |

భవిష్యత్తులో మనుషులకు ఉద్యోగాలుండవని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉద్యోగాలన్నింటినీ ఏఐ భర్తీ చేసేస్తుందన్నారు.

Elon musk
X

దిశ, నేషనల్ బ్యూరో: భవిష్యత్తులో ఉద్యోగాలన్నీ మాయమైపోతాయని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టీసీఎస్, యాక్సెంచర్ వంటి టెక్ దిగ్గజాలు ఏఐని ఉపయోగించుకుంటూ భారీగా ఉద్యోగులను తొలగించేసిన సంగతి తెలిసిందే. తాజాగా అమెజాన్ కూడా ఇదే ప్రకటన చేసింది. 2027 నాటికి కనీసం 1.6 లక్షల ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిపింది. ఈ స్థానాలను ఏఐ, రోబోట్స్‌తో నింపనున్నారట.

దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. ‘అన్ని ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసేస్తుంది. భవిష్యత్తులో పని చేయడం అనేది ఆప్షనల్‌గా మారుతుంది. అంటే సొంతంగా కూరగాయలు పండించుకోవాలా? లేదంటే మార్కెట్లో కొనాలా? అనే ఆప్షన్‌లా అన్నమాట’ అని మస్క్ పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో ఏఐ ఎదుగుదలతో ప్రపంచం మారిపోతుందని, ప్రజలంతా అధిక ఆదాయ వర్గంగా మారతారని చెప్పారు. సొంతంగా పూర్తి ఏఐ టెక్నాలజీతో ‘మాక్రోహార్డ్’ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టిన మస్క్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో.. అందరిలో టెన్షన్ పెరిగిపోతోంది.

ఇండస్ట్రీ అభివృద్ధిలో అందరి కన్నా ముందుండే మస్క్ ఇలా అన్నాడంటే.. నిజంగా ఉద్యోగాలన్నీ పోతాయేమో అని ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా మస్క్ ఇలాంటి కామెంట్స్ చేశారు. 2024లో పారిస్‌లో జరిగిన ఇక కార్యక్రమంలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ సొంతంగా ఒక రోబో సహాయకుడు ఉంటాడని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏఐతో పోటీ పడకుండా.. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎదగడం నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story