దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్నికల ఫలితాలు.. ముగ్గురు ముఖ్యమంత్రులు వెనుకంజ

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-04 06:25:42  IST  )

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.

దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్నికల ఫలితాలు.. ముగ్గురు ముఖ్యమంత్రులు వెనుకంజ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. రాజకీయ ఉద్ధండులు, సిట్టింగ్ సీఎంలుగా ఉన్న ముగ్గురు కీలక నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల కంటే వెనుకబడి ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని తాజా ట్రెండ్స్ అధికార పార్టీలను కలవరపెడుతున్నాయి. దాదాపు అక్కడ అధికార మార్పు ఖాయంగా కనిపిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ..

లేడీ టైగర్‌గా పేరుగాంచిన టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ప్రారంభ రౌండ్లలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యం మారుతున్నప్పటికీ.. అంతిమంగా ఆమెపై సువేందు వెనక్కి నెట్టడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

స్టాలిన్‌కు ఎదురుగాలి..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ (MK Stalin)కు తన కంచుకోట అయిన కొళత్తూరులో ఊహించని షాక్ తగిలింది. ఇక్కడ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) అభ్యర్థి వీఎస్. బాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దశాబ్దాలుగా డీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో సీఎం వెనుకంజలో ఉండటం, తమిళ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

కేరళంలో విజయన్‌కు అంతే..

కేరళలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న ఎల్డీఎఫ్ (LDF)కు అక్కడ ప్రజలు దెబ్బకొట్టారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) తన సొంత నియోజకవర్గం ధర్మదంలో యూడీఎఫ్ (UDF) అభ్యర్థి అబ్దుల్ రషీద్ కంటే వెనుకబడి ఉన్నారు. కేరళ చరిత్రలో అసాధ్యమైన హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్న విజయన్‌కు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది.

నాడు వైసీపీ పరిస్థితే.. నేడు డీఎంకేకీ.. సేమ్ టూ సేమ్ రిపీట్

Next Story