రూ. 2.50 లక్షల ఫిట్నెస్ పోటీ.. ఉద్యోగితో బెట్ ఓడిన జెరోదా చీఫ్

by Muthe.Rajitha |

జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్, అతని కంపెనీ ఉద్యోగి రోహిత్ అగర్వాల్ మధ్య జరిగిన ఫిట్‌నెస్ బెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రూ. 2.50 లక్షల ఫిట్నెస్ పోటీ.. ఉద్యోగితో బెట్ ఓడిన జెరోదా చీఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్, అతని కంపెనీ ఉద్యోగి రోహిత్ అగర్వాల్ మధ్య జరిగిన ఈ ఫిట్‌నెస్ బెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ ఉద్యోగుల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి జెరోదా అధినేత నితిన్ కామత్ ఆసక్తికరమైన ఫిట్‌నెస్ బెట్ కట్టారు. ఏడాది కాలంలో 30 కిలోల బరువు తగ్గితే రూ.2.5 లక్షల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. బాస్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకున్న రోహిత్ అగర్వాల్ అనే ఉద్యోగి కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఈ బెట్‌లో విజయం సాధించారు.

ఉద్యోగి రోహిత్ అగర్వాల్ గత ఏడాది కాలంలో ఎంతో కష్టపడి తన బరువును 104 కిలోల నుండి 75 కిలోలకు తగ్గించుకున్నారు. ఈ విజయంపై ఆయన స్పందిస్తూ.. డబ్బు కంటే కూడా ఫిట్‌నెస్ సాధించడమే తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిందని, తన బాస్ నితిన్ కామత్ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని కృతజ్ఞతలు తెలిపారు. అటు నితిన్ కామత్ కూడా ఈ బెట్‌లో తాను ఓడిపోయి రూ.2.5 లక్షలు కోల్పోయినా, తన ఉద్యోగి బరువు తగ్గి ఆరోగ్యంగా మారడం పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

"ఈ బెట్‌లో ఓడినా నాకు ఎంతో ఆనందంగా ఉంది" అంటూ నితిన్ కామత్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఇంతటి గొప్ప చొరవ తీసుకున్న జెరోదా బాస్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కామత్ డబ్బులు ఓడిపోయినా ఒకరి జీవితాన్ని గెలిపించారని కొనియాడగా, 30 కిలోల బరువు తగ్గడమే రోహిత్ సాధించిన అసలైన విక్టరీ అంటూ నెటిజన్లు ఇద్దరికీ అభినందనలు తెలుపుతున్నారు.

Next Story