నాడు వైసీపీ పరిస్థితే.. నేడు డీఎంకేకీ.. సేమ్ టూ సేమ్ రిపీట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-04 06:26:18  IST  )

ఆంధ్రా రాజకీయ ముఖచిత్రాన్ని ఓటర్లు మార్చినట్లే.. అదే సీన్ ఇప్పుడు తమిళనాడులోనూ కనిపిస్తోంది. డీఎంకే కోట బీటలు వారుతోంది.

నాడు వైసీపీ పరిస్థితే.. నేడు డీఎంకేకీ.. సేమ్ టూ సేమ్ రిపీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాల తరహాలోనే, ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ పెను సంచలనం నమోదవుతోంది. అధికార డీఎంకే ఘోర పరాజయం దిశగా సాగుతుండగా.. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టిస్తోంది. వైసీపీని గద్దె దించాలని ఆంధ్రా ఓటర్లు ఏ స్థాయిలో ఓట్లు వేశారో.. తమిళనాడులోనూ డీఎంకేకు స్వస్తి పలకాలని ప్రజలు ఓటెత్తినట్లు కనిపిస్తోంది.

ఏపీ సీన్ రిపీట్.. కుప్పకూలుతున్న డీఎంకే కోట!

గత ఏపీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైన తీరునే నేడు తమిళనాడులో డీఎంకే పరిస్థితి తలపిస్తోంది. భారీ మెజార్టీతో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటామన్న ధీమాతో ఉన్న డీఎంకేకు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. విజయ్ టీవీకే పార్టీ 109 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోంది. ఏఐడీఎంకే 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. డీఎంకే కేవలం 50 స్థానాలకే పరిమితమై మూడో స్థానానికి పడిపోయింది. ఇదే కొనసాగితే డీఎంకేకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా దాదాపు 28 మంది మంత్రులు తమ ప్రత్యర్థుల చేతిలో వెనుకంజలో ఉండటం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

కన్నీటి పర్యంతమైన కార్యకర్తలు.. టెంట్ల తొలగింపు!

డీఎంకే అభ్యర్థులు గెలిచే సూచనలు లేకపోవడంతో చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం 'అన్నా అరివాలయం' బోసిపోయింది. విజయోత్సవ సంబరాల కోసం ముందుగానే భారీగా వేసిన టెంట్లను ఇప్పుడు సిబ్బంది తొలగిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఫలితాలను చూసి తట్టుకోలేక డీఎంకే నేతలు వెనుదిరగగా, కార్యకర్తలు రోడ్డుపైనే బోరున విలపిస్తూ కనిపించారు.

సినిమా గ్లామర్ పనిచేసింది: డీఎంకే నేత సోము

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై డీఎంకే నేత ఎన్‌వీఎన్ సోము స్పందిస్తూ.. విజయ్‌కు ఉన్న భారీ అభిమాన గణం అంతా ఆయనకే ఓటు వేసిందని అభిప్రాయపడ్డారు. "తమిళనాడు ప్రజలకు సినిమాల నుంచి వచ్చిన వారిని ఆదరించడం కొత్తేమీ కాదు, చరిత్రలో చాలా మందిని ఆదరించారు. ఇదేమీ మాకు ఆశ్చర్యం కలిగించదు. చివరికి డీఎంకేకు మంచి నంబర్లే వస్తాయి" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే.. ప్రస్తుత ట్రెండ్స్ గమనిస్తే.. తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐడీఎంకే ద్వంద్వ రాజకీయాలకు విజయ్ చెక్ పెట్టినట్లు స్పష్టమవుతోంది.

దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్నికల ఫలితాలు.. ముగ్గురు ముఖ్యమంత్రులు వెనుకంజ

Next Story