ఎన్నారైలూ.. కాస్త తగ్గండి!!

by Muthe.Rajitha |

అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షలాది మంది భారతీయులు స్థిరపడ్డారు.

ఎన్నారైలూ.. కాస్త తగ్గండి!!
X

అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షలాది మంది భారతీయులు స్థిరపడ్డారు. దశాబ్దాలుగా ఆయా దేశాల ఆర్థిక, సాంకేతిక, వైద్య రంగాల అభివృద్ధికి మనవారు ఎంతగానో తోడ్పాటు అందించారు. ప్రారంభ రోజుల్లో విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడి వాతావరణానికి, సమాజానికి తగ్గట్టుగా మసలుకునేవారు. స్థానిక సంస్కృతిని గౌరవిస్తూనే, తమ విధుల్లో నిబద్ధతను కనబరిచేవారు. ఆ సమయంలో ఆ దేశాల ప్రజల నుంచి కూడా భారతీయులకు ఎంతో అద్భుతమైన సహకారం దక్కింది. అక్కడి వారంతా భారతీయులతో కలిసిపోవడం, మన పండుగలు, ఆహారపు అలవాట్లు, కల్చర్ పట్ల ఆసక్తి పెంచుకోవడం కూడా జరిగింది. ఒక సామరస్య పూర్వకమైన సహజీవనం రెండు వర్గాల మధ్య కొనసాగింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు ఒకప్పుడు ఎంతో సానుకూల గుర్తింపు ఉండేది.

కానీ, కాలక్రమేణా క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. ఒకప్పుడు భారతీయుల పట్ల ఎంతో సానుకూలంగా ఉన్న విదేశీ సమాజాల్లో ఇప్పుడు స్పష్టమైన వ్యతిరేకత, అసహనం కనిపిస్తోంది. దీనికి కేవలం స్థానిక ఆర్థిక పరిస్థితులే కాకుండా, భారతీయుల తీరులో వచ్చిన మార్పులు కూడా ప్రధాన కారణమే. గతంలో అక్కడి సమాజంలో కలిసిపోయేందుకు భారతీయులు ప్రయత్నించగా.. ఇప్పుడు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించేందుకు, తమదే పైచేయి అన్నట్లుగా భారతీయ సంస్కృతిని అత్యంత ఆర్భాటంగా ప్రదర్శిస్తున్నారు. కెనడా, బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం.

ఆర్భాటపు ప్రదర్శనలు.. పెరుగుతున్న వ్యతిరేకత

కెనడాలో విపరీతంగా పెరిగిపోయిన వలసదారుల వల్ల బహిరంగ ప్రదేశాల్లో వారు ప్రవర్తిస్తున్న తీరుపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, పండుగల పేరిట బ్రిటన్, అమెరికా వీధుల్లో భారీ ఎత్తున ఊరేగింపులు చేయడం, పబ్లిక్ స్థలాలను ఆక్రమించి హడావుడి చేయడం, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, అర్ధరాత్రి వరకు శబ్ద కాలుష్యం చేయడం వంటి చర్యల వల్ల స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కేవలం అమెరికాలోనే డల్లాస్ ప్రాంతంలో దీపావళి పండుగను పురస్కరించుకుని భారతీయులు ముఖ్యంగా తెలుగువాళ్లు పటాసులు కాల్చడం వల్ల ప్రతి ఏటా పదుల సంఖ్యలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పొగ కారణంగా అనేకమంది స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకప్పుడు తమ ఇళ్లకే పరిమితమైన వేడుకలను ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లోకి తీసుకువచ్చి, ‘ఈ గోల అంతా ఏంటి’ అని స్థానికులు విసుక్కునే స్థాయికి కొన్ని వర్గాల వ్యవహారశైలి దిగజారింది.

‘మాగా’ ప్రచారం.. మారుతున్న స్థానికుల స్వరం

ఈ సాంస్కృతిక ఘర్షణ ఇప్పుడు రాజకీయ రూపం కూడా దాల్చుతోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా వలస విధానాలపై పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో విదేశీయుల వల్ల స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదనే వాదనను ఆయన బలంగా వినిపిస్తుంటారు. ఆయన ప్రారంభించిన ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) ప్రచారంలోనూ వలసదారుల ప్రస్తావన పదే పదే వస్తోంది. ముఖ్యంగా వలసదారులు స్థానిక సంస్కృతిలో కలిసిపోకుండా, వేరుగా ఉంటూ తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారనే వాదనను స్థానికులు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వంటి దేశాలు వలసదారుల నియంత్రణకు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే హెచ్-1బి వీసా నిబంధనలను కఠినతరం చేయడం, గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలో జాప్యం వంటి నిర్ణయాలతో ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులను ఇబ్బందులకు గురిచేసే వ్యూహాన్ని అమెరికా అమలుచేస్తోంది. మన వారి ఆర్భాటపు ప్రదర్శనలు పరోక్షంగా ఇక్కడి స్థానికుల్లో ‘మన దేశాన్ని వీరు ఆక్రమించేస్తున్నారు’ అనే అభద్రతా భావాన్ని రేకెత్తిస్తున్నాయి.

యూదుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం

ఈ విపత్కర పరిస్థితుల్లో భారతీయులు ఇతర వలస వర్గాలను, ముఖ్యంగా యూదులను చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, ఆర్థికంగా, రాజకీయంగా అత్యున్నత స్థానాల్లో ఉన్న వర్గంగా యూదులకు పేరుంది. వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఆయా స్థానిక ప్రజలతో పూర్తిగా కలిసిపోతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూనే స్థానిక ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా ఎదుగుతారు. అయితే, వారు తమ సంస్కృతిని, మతాన్ని అత్యంత పదిలంగా, వ్యక్తిగతంగా కాపాడుకుంటారు. వారు ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నా.. ఆర్భాటాలకు, బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉంటారు. తమ కల్చర్‌ను ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేయరు. తద్వారా తమపై స్థానికంగా ఎలాంటి వ్యతిరేకత రాకుండా చాలా జాగ్రత్తపడతారు. తమ సమాజం గుట్టుగా, కానీ అత్యంత బలంగా ఉండేలా చూసుకుంటారు. ప్రదర్శనల కన్నా, సమాజంపై సానుకూల ప్రభావం చూపడం మీదే వారి దృష్టి ఉంటుంది.

తలుపులు మూసుకుపోతున్నాయి.. జాగ్రత్త

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న భారతీయులు ఈ క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించాలి. మనం ఒక దేశానికి వెళ్లినప్పుడు అక్కడి చట్టాలను, ప్రజలను, వారి జీవన విధానాన్ని గౌరవించడం మన ప్రాథమిక బాధ్యత. మన సంస్కృతి గొప్పదే కావచ్చు, కానీ దానిని ఇతరుల ముంగిట ఆర్భాటంగా ప్రదర్శించి వారిలో అసహనం పెంచడం ఎంతమాత్రం వివేకం కాదు. విదేశాల్లో జీవిస్తున్న ప్రస్తుత తరం కేవలం తమ ఉనికిని చాటుకోవాలనే తాపత్రయంతో చేసే పనుల వల్ల భవిష్యత్తు తరాలకు ఊహించని నష్టం వాటిల్లుతుంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో భారతీయులకు అన్ని దేశాలు తమ తలుపులు శాశ్వతంగా మూసివేసే ప్రమాదం ఉంది. ఈ విషయం ఇప్పటికైనా భారతీయులకు అర్థం అయితే, విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం కలలు కనే మరికొన్ని తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆచరణాత్మకంగా వ్యవహరించి, ఆర్భాటాలకు పోకుండా స్థానికులతో మమేకమై జీవించడమే ఎన్నారైల ముందున్న ఏకైక రక్షణ మార్గం.

హరీశ్ ఎస్పీ

[email protected]

Next Story