11 ఏళ్ల కుమారుడి చేత కాస్ట్లీ కారు డ్రైవింగ్.. అరెస్ట్ చేసిన పోలీసులు

by Muthe.Rajitha |

ORR లాంటి అత్యంత వేగంగా వాహనాలు ప్రయాణించే రహదారిపై ఒక తండ్రి చేసిన నిర్లక్ష్యపు పని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

11 ఏళ్ల కుమారుడి చేత కాస్ట్లీ కారు డ్రైవింగ్.. అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ORR) లాంటి అత్యంత వేగంగా వాహనాలు ప్రయాణించే రహదారిపై ఒక తండ్రి చేసిన నిర్లక్ష్యపు పని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. టోలీచౌకీ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ హాదీ ఇటీవల ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. అయితే, ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో, నిబంధనలను పక్కనబెట్టి తన 11 ఏళ్ల మైనర్ కుమారుడికి కారు స్టీరింగ్‌ అప్పగించాడు. ప్రమాదకరమైన ఆ హైవేపై బాలుడు కారు నడుపుతుంటే ఆ తండ్రి పక్కనే కూర్చుని ఎంజాయ్ చేసాడు. కాగా అదే సమయంలో ఆ రహదారిపై మరో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, ఈ ప్రమాదకర దృశ్యాన్ని తన మొబైల్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌ కావడంతో పాటు, పలువురు నెటిజన్లు 'ఎక్స్‌'లో నేరుగా ట్రాఫిక్‌ పోలీసుల అధికారిక ఖాతాకు ట్యాగ్‌ చేసి ఫిర్యాదు చేశారు.

రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియో ఆధారంగా ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్ ఆధారంగా యజమాని అబ్దుల్‌ హాదీని గుర్తించారు. డ్రైవింగ్‌ సీటులో ఉన్నది అతని 11 ఏళ్ల కుమారుడేనని తేలడంతో, రాజేంద్రనగర్‌ పోలీసులు నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకుని, ఆ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు. అత్యంత వేగంగా వాహనాలు ప్రయాణించే ORR రహదారిపై మైనర్ బాలుడికి వాహనాన్ని ఇచ్చి ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేయించినందుకు గానూ తండ్రిపై పలు చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు.

Next Story