'రైతు భరోసా'పై సర్కారు కీలక నిర్ణయం.. మొదటి ప్రాధాన్యత వారికే!

by Muthe.Rajitha |

రాష్ట్రంలో రైతులకు ఆర్థిక సహాయం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం 'రైతు భరోసా' నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసింది.

రైతు భరోసాపై సర్కారు కీలక నిర్ణయం.. మొదటి ప్రాధాన్యత వారికే!
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో రైతులకు ఆర్థిక సహాయం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం 'రైతు భరోసా' నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ పథకంలో భాగంగా అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి పెట్టుబడి సహాయాన్ని నేరుగా జమ చేయడానికి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ఈ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈసారి నిధుల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా అధికారులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగానే నిధులను ఒకేసారి కాకుండా, విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ప్లాన్ ప్రకారం.. ముందుగా అత్యధిక ప్రాధాన్యతను చిన్న, సన్నకారు రైతులకు కల్పిస్తూ మొత్తం ప్రక్రియను మూడు ప్రధాన దశలుగా విభజించారు. అందులో భాగంగా రాబోయే మొదటి దశలో, ఒక ఎకరం లేదా అంతకంటే తక్కువ భూమి కలిగిన పేద రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ముందుగా జమ చేయనున్నారు. ఈ మొదటి విడత పూర్తయిన తర్వాత ప్రారంభమయ్యే రెండవ దశలో, రెండు ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులందరికీ ఈ నిధుల పంపిణీని చేపడతారు. ఇక ఆఖరిగా చేపట్టే మూడవ దశలో, ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సహాయాన్ని బదిలీ చేయాలని అధికారులు ప్రణాళికను రూపొందించారు. ఇక నిధుల సర్దుబాటును బట్టి మిగతా రైతులకు కూడా నిధులు విడుదల చేస్తామని వెళ్లడించారు.

Next Story