భూ భారతిలో ‘మార్కెట్ వాల్యూ’ మాయం.. 15 రోజులు దాటినా కుదరని లెక్కలు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-19 01:23:54  IST  )

తెలంగాణ ‘భూ భారతి’ పోర్టల్‌లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ కాలమ్ మాయం కావడంపై చర్చనీయాంశంగా మారింది.

భూ భారతిలో ‘మార్కెట్ వాల్యూ’ మాయం.. 15 రోజులు దాటినా కుదరని లెక్కలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను ప్రాంతం, వినియోగాన్ని బట్టి 20 నుంచి 300 శాతం వరకు ప్రభుత్వం పెంచింది. అయితే, భూ భారతి పోర్టల్‌లో మార్కెట్ వాల్యూస్ మాడ్యూల్‌ని తొలగించారు. ల్యాండ్ డీటెయిల్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఓ కాలమ్‌లో మార్కెట్ విలువ ఎకరానికి ఎంత అనేది ఉండేది. ఇప్పుడది కనిపించడం లేదు. మార్కెట్ ధరలను అమల్లోకి తీసుకొచ్చిన మొదటి రెండు రోజులు అంటే 5, 6 తేదీల్లో కనిపించాయి. ఆ తర్వాత రోజు నుంచి కొద్దిసేపు కనిపించడం, మరికొద్ది సేపు మాయం కావడం చూశాం. ఇప్పుడేమో అసలే ఆ కాలమ్ ఎత్తేశారు. ప్రస్తుతం ఏ ఊర్లో ఎంత అనేది తెలుసుకోవడం అసాధ్యం. ధరణి పోర్టల్, మొన్నటి దాకా భూ భారతి పోర్టల్‌లో ఈ మార్కెట్ విలువలను తెలుసుకోవడం చాలా ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఆఖరికి తహశీల్దార్ తన లాగిన్‌లోకి వెళ్లి ఫలానా సర్వే నంబరులోని భూమి విలువ ఎంత అనేది చెప్పడం కష్టమవుతున్నది. మార్కెట్ విలువలను అమల్లోకి తీసుకొచ్చినప్పుడు సర్వర్ డౌన్ అనే ప్రచారం జరిగింది. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతుండడంతో గందరగోళంగా మారింది. మార్కెట్ విలువలు దాచడం వల్ల ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు, నష్టాలేమీ లేవు. ఏ సాంకేతిక లోపం వల్లనో అవి అదృశ్యమయ్యాయి. వీటిని పునరుద్ధరించడం కష్టమేమీ కాదు. కానీ 15 రోజులైనా గాడిన పడకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదన్న చర్చ నడుస్తున్నది.

వాల్యూస్ రివిజన్?

మొదటి రెండు రోజులు వెబ్‌సైట్‌లో మార్కెట్ వాల్యూస్ కనిపించడంలేదని ఆందోళన చెందారు. దానికి కొన్ని మండలాల్లో సర్దుబాట్లు చేస్తున్నారని అధికారులు చెప్పారు. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వాల్యూస్ సవరణల్లో లోపాలను సరిదిద్దుతున్నారని అన్నారు. అది ఎంత వరకు నిజమో ఏమో‌గానీ ఇప్పటి వరకు సెట్ కాలేదు. 15 రోజుల తర్వాత కూడా మార్కెట్ వాల్యూస్ అంశంలో పారదర్శకత లేకపోవడం అధికారుల వైఫల్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పునర్విభజన చేసినా ప్రస్తుత ధరలు కనిపించేలా చేయడం వల్ల నష్టం ఏమిటో అధికారులకే తెలియాలి. భూ భారతి అద్భుతమని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ మార్కెట్ వాల్యూస్ గందరగోళానికి తెర దించడంలో అధికారులు విఫలమవుతుండడం గమనార్హం.

స్టాంప్ డ్యూటీ లెక్కించడం ఎలా?

సాధారణంగా భూ భారతి వెబ్‌సైట్‌లో ల్యాండ్ సెర్చ్ ఓపెన్ చేసి జిల్లా, డివిజన్, మండలం, ఊరు, సర్వే నంబరు, ఖాతా నంబరు, క్యాప్చా ఎంట్రీ చేయగానే పూర్తి వివరాలు వస్తాయి. అందులో ఒక కాలమ్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడది కనిపించడం లేదు. మిగతా అన్ని వివరాలున్నాయి. అలాగే మార్కెట్ వాల్యూస్ అనే మాడ్యూల్ సెపరేట్‌గా ఉండేది. అది పూర్తిగా కనిపించడం లేదు. ఏ ఊరు, ఏ సర్వే నంబరులో మార్కెట్ వాల్యూ ఎంత అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. ఎవరైనా కొనుగోలు, అమ్మకాలు సాగించినప్పుడు స్టాంప్ డ్యూటీ ఎంత అవుతుందని ల్యాండ్ డీటెయిల్స్ చూసి చెప్పడం అసాధ్యంగా మారింది. అసలు విలువ ఎంతో తెలియకుండా సేల్ డీడ్‌కి స్టాంప్ డ్యూటీ 7.5 శాతం లెక్కించడం కుదరదు.

స్లాట్ బుక్ చేస్తేనే..

భూ భారతి పోర్టల్‌లో మార్కెట్ వాల్యూస్ కనిపించడం లేదు. అయితే క్రయ విక్రయాలు ఎలా సాధ్యం? అనే డౌట్ వస్తున్నది. స్లాట్ బుక్ చేసేటప్పుడు మాత్రం ల్యాండ్ డీటెయిల్స్ వస్తున్నాయి. దాంతో పాటు ఆయనకు ఎంత ల్యాండ్ ఉందో ఆ మొత్తం విస్తీర్ణం మార్కెట్ వాల్యూ కనిపిస్తుందని మీ సేవ నిర్వాహకులు అంటున్నారు. అంటే 2 ఎకరాలు ఉంటే.. రూ.20 లక్షలు కనిపిస్తుంది. అంటే ఎకరం రూ.10 లక్షలుగా లెక్కిస్తూ స్టాంప్ డ్యూటీ కడుతున్నట్టు చెప్పారు. గతంలోనే ఖాతా నంబరులో ఎంత భూమి ఉన్నప్పటికీ ఎకరం మార్కెట్ విలువ కనిపించేది. ఇప్పుడది లేదు. ఈ మార్పు వల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువ. ప్రస్తుతం మార్కెట్ విలువలు ఎంతనేది కొనుగోలుదారులు, అమ్మకందారులకు తెలియకుండా పోయింది. దాని వల్ల యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న స్టాంప్ డ్యూటీ స్కాంకి ఆస్కారం లేకపోలేదు. కనిపించని మార్కెట్ విలువను పెంచి చెప్పడం ద్వారా అధికంగా వసూలు చేయడానికి అవకాశం లేకపోలేదు అంటున్నారు.

వ్యవసాయేతరం క్లియర్

ప్లాట్లు, ఇండ్లు, అపార్టుమెంట్ల ధరలు పక్కాగానే కనిపిస్తున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో మార్కెట్ వాల్యూస్ అనే మాడ్యూల్‌కి వెళ్తే చాలా క్లియర్‌గా రేట్లు దర్శనమిస్తున్నాయి. ప్రతి ఊరు, కాలనీల వారీగా పెంచిన ధరలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ భూముల ధరలు మాత్రమే కనిపించడం లేదు. అంటే భూ భారతి వెబ్ పోర్టల్‌లో మాత్రమే మార్కెట్ వాల్యూస్‌ని హైడ్ చేశారు. సీసీఎల్ఏ అధికార వర్గాలు స్పందిస్తే తప్ప సామాన్యులకు భూముల విలువలు కనిపించే అవకాశం లేదు.

మార్కెట్ వాల్యూస్ పెంచిన తర్వాత రిజిస్ట్రేషన్లు

రిజిస్ట్రేషన్లు/మ్యుటేషన్లు: 23,581

సక్సెషన్స్: 3,106

పార్టిషన్స్: ‌‌0

పెండింగ్ మ్యుటేషన్లు: 5

నాలా కన్వర్షన్లు: 1,524

సగటు రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.29,294

సగటు నాలా ఫీజు: రూ.27,998

Next Story