కాళేశ్వరానికి మళ్లీ ‘ఎండిన’ ఏడాదే..! వచ్చే వేసవి వరకూ మేడిగడ్డలో నీటి నిల్వలు నిల్‌

by Kema Shiva Kumar |

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈ ఏడాది కూడా నిరుపయోగంగానే ఉండనున్నాయి.

కాళేశ్వరానికి మళ్లీ ‘ఎండిన’ ఏడాదే..! వచ్చే వేసవి వరకూ మేడిగడ్డలో నీటి నిల్వలు నిల్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం రూ.వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా నిరుపయోగంగా ఉండే అవకాశం ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈ వర్షాకాలంలోనూ వినియోగంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బ్యారేజీ భద్రత, పునాది స్థిరత్వం, పియర్ల పరిస్థితిపై కొనసాగుతున్న సాంకేతిక పరీక్షలు ఇంకా పూర్తికాకపోవడంతో నీటిని నిల్వలు చేసే అవకాశం లేదని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే మూడేళ్లుగా నీటి నిల్వలు లేక నిరుపయోగంగా ఉన్న మేడిగడ్డకు ఈ ఏడాది సైతం అదే పరిస్థితి కొనసాగనుంది. బ్యారేజీలో పియర్లు కుంగిన తీరుపై పరీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 75 శాతం పరీక్షలు పూర్తయినట్టు ప్రభుత్వం చెబుతున్నా మిగిలిన పరిశీలనలు పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ నవంబర్‌ వరకు సాగవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లోపు వర్షాలు ఊపందుకుంటే పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.

కొనసాగుతున్న కీలక టెస్టులు

ప్రస్తుతం మూడు బ్యారేజీల పరిధిలో టెస్టులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా హైడ్రాలాజికల్, జియోటెక్నికల్‌ అధ్యయనాలు చేపట్టారు. ఈ పరీక్షలు కాళేశ్వరం భవిష్యత్ ను నిర్ణయించనున్నాయి. బ్యారేజీ నిర్మాణానికి ఆధారంగా ఉన్న పునాది పొరల బలం, భూగర్భస్థితి, రాఫ్ట్‌ కింద ఖాళీలు ఏర్పడ్డాయా? లేదా, మట్టి స్వభావం ఎలా ఉంది? అనే అంశాలపై అత్యాధునిక పరికరాలతో పరిశోధనలు చేస్తున్నారు. అందుకోసం భారీ డ్రిల్లింగ్‌ యంత్రాలను వినియోగిస్తూ 80 మీటర్ల లోతు వరకు బోర్లు వేస్తున్నారు. సుమారు 240 అడుగుల లోతు నుంచి మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో విశ్లేషిస్తున్నారు. అయితే సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల ప్రాంతాల్లో 900 అడుగుల లోతు వరకు మెత్తటి మట్టి పొరలు ఉన్నట్టు గతంలో గుర్తించిన నిపుణులు.. మేడిగడ్డ పరిసర ప్రాంతాల్లోనూ కొన్నిచోట్ల ఇలాంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు సమాచారం. ఇదే పరిస్థితి బ్యారేజీ పునాది ప్రాంతంలో ఉంటే భవిష్యత్తులో మరిన్ని నిర్మాణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాఫ్ట్‌ కింద ఖాళీలు ఏర్పడటం అత్యంత ప్రమాదకరమని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. రాఫ్ట్‌ కింద మట్టి కొట్టుకుపోయి ఖాళీలు ఏర్పడితే పియర్లపై అసమాన ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పియర్లు బలహీనపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే.. కేవలం దెబ్బతిన్న పియర్లకు మరమ్మతు చేయడం కాకుండా మొత్తం బ్యారేజీ నిర్మాణ వ్యవస్థను సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

రిపోర్టుల తర్వాతే మరమ్మతులు

బ్యారేజీల్లో అన్నిపరీక్షలు పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్డీఎస్‌ఏ)లకు అందజేయనున్నారు. ఆ సంస్థలు ఇచ్చే సూచనల ఆధారంగానే తుది మరమ్మతులకు ప్రణాళిక రూపొందించనున్నారు. మరోవైపు.. మేడిగడ్డలోని ప్రతి పియర్‌కు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పియర్ల నిలువు స్థితి, కదలికలు, కాంక్రీట్‌ బలం, పునాది స్థిరత్వం వంటి అంశాలను సాంకేతిక బృందాలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే పియర్లకు డ్యామేజీ ఏర్పడటంతో మరోసారి రిపీట్ కాకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. ఎక్కడా రాజీ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టు అధికారులు వివరిస్తున్నారు.

ఎల్‌నినోతో సాగునీటి కష్టాలు

మరోవైపు.. ప్రపంచ దేశాలను ఎల్‌నినో భయపెడుతున్నది. మరికొద్ది రోజుల్లోనే అది సూపర్ ఎల్‌నినోగా మారబోతున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు ఇప్పటికే జూన్ సగానికి పైగా గడిచినా ఇంకా ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈసారి కూడా వినియోగంలోకి రాకపోవడంతో ఉత్తర తెలంగాణ ప్రజలకు నీటికష్టాలు తప్పేలా లేవు. సాగు, తానీటికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కాళేశ్వరం వ్యవస్థ అందుబాటులో లేకపోవడం రైతాంగాన్ని కలవరపెడుతున్నది. ఓవైపు అనిశ్చిత వర్షాలు, మరోవైపు నీటి నిల్వలకు దూరమైన బ్యారేజీలు కలిసి సాగునీటి భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

వచ్చే వేసవి నాటికి పనులు

వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల ఫలితాలపైనే ఆధారపడి ఉంది. వచ్చే ఏడాది వేసవి నాటికి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. సాంకేతిక, హైడ్రలాజికల్ అధ్యయనాలు పూర్తి చేయడంతో పాటు సెప్టెంబర్ నాటికి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయాలని భావిస్తున్నది. పనులపై సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులపై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ.. ప్రాజెక్టు అకౌంటబిలిటీ కోసం జ్యుడీషియల్ కమిషన్, నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీతో ఎంక్వైరీ, విజిలెన్స్​కమిషన్​ఎంక్వైరీ వంటి వాటిని చేయించామమని పేర్కొన్నారు. ఎన్‌డీఎస్ఏ చెప్పిన టెస్టులను నిర్వహించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ లో పనులు మొదలుపెట్టి కేవలం ఒక్క వర్కింగ్​సీజన్‌లోనే పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2027 వేసవి కాలంలో పనులు పూర్తిచేయాలనే టార్గెట్​పెట్టుకున్నామని వెల్లడించారు.

Next Story