ఎండుటాకులను ఎరువుగా మార్చి..

by Muthe.Rajitha |

సృష్టిలో జీవరాశిని అన్ని విధాలా ఆదుకొనేవి వృక్షాలే. అయితే అవి రాల్చే ఎండుటాకులను ఏం చేయాలి అనేది నగరంలోని అపార్ట్ మెంట్లకు పెద్ద సమస్యగా మారిపోయింది.

ఎండుటాకులను ఎరువుగా మార్చి..
X

సృష్టిలో జీవరాశిని అన్ని విధాలా ఆదుకొనేవి వృక్షాలే. అయితే అవి రాల్చే ఎండుటాకులను ఏం చేయాలి అనేది నగరంలోని అపార్ట్ మెంట్లకు పెద్ద సమస్యగా మారిపోయింది. కాల్చితే పొగ, వాయు కాలుష్యం. ఫలితంగా రకరకాల పర్యావరణ, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. చట్ట ప్రకారం ఇది నేరం కూడా. అయితే ఆ ఎండుటాకులతో చెట్లకు బలవర్ధక ఎరువు తయారు చేయవచ్చు అని హైదరాబాద్, కూకట్ పల్లిలోని సంపూర్ణం అపార్ట్ మెంట్ సొసైటీ నిరూపించింది. రాలిపడిన ఆకులను వైర్ మెష్‌లో వేసి కంపోస్టింగ్ ద్వారా ఎరువు తయారు చేసి అవే చెట్లకు వాడే విధానానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలిచిన సంపూర్ణం ఆలోచన ఇప్పుడు జిహెచ్ఎంసి అధికారుల దృష్టిలో పడింది.

అందరి లాగే సంపూర్ణం అపార్ట్ మెంట్ సొసైటీ కూడా చెట్ల నుంచి పడే ఎండిన ఆకులను కాల్చేవారు. ఈ ప్రక్రియ వల్ల పలు సమస్యలు ఏర్పడేవి. వాయు కాలుష్యం పెరిగేది. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిపై ప్రతికూల ప్రభావం చూపేది. పొగ కారణంగా నివాసితులకు అసౌకర్యం కలిగేది. అదేవిధంగా కాంపౌండ్ గోడలు నల్లగా మారి అందవిహీనంగా కనిపించేవి. ప్రధాన ద్వారం వద్ద ఆకుల గుట్టలు పేరుకుపోవడం వల్ల పరిసరాల పరిశుభ్రత దెబ్బతినేది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో సంపూర్ణం సొసైటీ ముందడుగు వేసింది. ఎండిన ఆకులను వైర్ మెష్ కంపోస్టర్‌లో వేయడం ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేయాలనే ఆలోచనను ఆ సొసైటీ అధ్యక్షుడు వి. జగదీశ్వర్ ముందుకు తెచ్చారు.

ఆకుల్ని సహజ సిద్ధ ఎరువుగా మార్చి..

వైర్ మెష్ కంపోస్టర్ అనేది గాలి సులభంగా ప్రసరించేలా రూపొందించిన జాలి నిర్మాణం. ఇందులో నిల్వ చేసిన ఆకులు సహజసిద్ధంగా కుళ్లి కొద్ది కాలంలోనే సేంద్రియ ఎరువుగా మారతాయి. ఈ విధానంలో ఎండిన ఆకులను వైర్ మెష్ బిన్‌లలో నిల్వ చేస్తారు. గాలి ప్రసరణతో సహజంగా కుళ్లే ప్రక్రియ జరుగుతుంది. పోషక విలువలు గల కంపోస్ట్ తయారవుతుంది. ఆ కంపోస్ట్‌ను సొసైటీ తోటలు, మొక్కలకు ఉపయోగించవచ్చు. ఈ విధానం వల్ల వాయు కాలుష్యం తగ్గింది. ఆకులను కాల్చే అవసరం పూర్తిగా తొలగిపోయింది. పొగ తగ్గి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడింది. ప్రధాన ద్వారం వద్ద ఆకుల గుట్టలు కనిపించకుండా పరిసరాలు పరిశుభ్రంగా మారాయి. ఎరువులు కొనుగోలు చేసే అవసరం తగ్గి సొసైటీకి ఆర్థిక ప్రయోజనం కూడా కలుగుతోంది.

ఇతర నివాస సముదాయాలకూ వర్తింపు

ఈ వినూత్న విధానం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళింది. అటుగా వచ్చిన కూకట్‌పల్లి డిప్యూటీ కమిషనర్‌ను ఇది ఆకట్టుకుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన 11 జూన్ 2026న తమ అధికారుల బృందంతో కలిసి సంపూర్ణం సొసైటీని సందర్శించారు. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ కూడా చూశారు. ఆకులను సేకరించడం నుంచి కంపోస్ట్ తయారయ్యే వరకు ప్రతి దశను వారు పరిశీలించారు. ఇతర నివాస సముదాయాలలో కూడా ఈ నమూనాను అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తామన్నారు.

వైర్ మెష్ కంపోస్టింగ్ విధానం ఆదర్శం

సాధారణమైన ఒక ఆలోచన నేడు ప్రభుత్వ అధికారుల ప్రశంసలు పొందే స్థాయికి చేరడం విశేషం. నగరాల్లో వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారిన దశలో సంపూర్ణం సొసైటీ అమలు చేసిన వైర్ మెష్ కంపోస్టింగ్ విధానం ఆదర్శంగా నిలుస్తోంది. అధిక ఖర్చు లేకుండా, సులభమైన పద్ధతిలో, ప్రకృతికి మేలు చేసే విధంగా వ్యర్థాలను ఉపయోగకరమైన వనరులుగా మార్చవచ్చని ఈ కార్యక్రమం నిరూపించింది. “వ్యర్థాన్ని వనరుగా మార్చడం” అనే సంపూర్ణం సొసైటీ చూపిన మార్గం పాటించడానికి తేలిక, ఫలితాలు అమోఘం.

- బద్రి నర్సన్

94401 28169

Next Story