విద్యాశాఖలో 'మోడల్ టీచర్ల' విలీనమెన్నడు!?

by Muthe.Rajitha |

6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో స్టేట్ సిలబస్‌తో నాణ్యమైన విద్యను అందించేందుకు 2013-14 విద్యాసంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 6,000 మోడల్ స్కూళ్లను ప్రారంభించింది.

విద్యాశాఖలో మోడల్ టీచర్ల విలీనమెన్నడు!?
X

6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో స్టేట్ సిలబస్‌తో నాణ్యమైన విద్యను అందించేందుకు 2013-14 విద్యాసంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 6,000 మోడల్ స్కూళ్లను ప్రారంభించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఈ స్కూళ్ళు విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో విద్యార్థులకు ఓ వరంలా మారాయి. అయితే, పథకం ప్రారంభించిన రెండేళ్లకే, 2015-16లో కేంద్ర ప్రభుత్వం ఈ స్కూళ్లకు ఆర్థిక సహాయాన్ని పూర్తిగా నిలిపివేసింది. అప్పటి నుంచి ఈ పాఠశాలల నిర్వహణ భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా, తమను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి, ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు చెల్లిస్తున్నట్లు నేరుగా ఖజానా నుంచి 010 పద్దు కింద జీతాలు అందేలా ఉత్తర్వులివ్వాలని పుష్కర కాలంగా కోరుతున్నారు.

హేతుబద్ధమైన డిమాండ్!

మోడల్ స్కూల్ టీచర్ల జీతభత్యాలను వంద శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇతర సొసైటీలతో పోలిస్తే మోడల్ టీచర్లకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ నిబంధనలే వర్తిస్తాయి. అత్యంత పారదర్శకంగా, మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని పాటించి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, పీజీటీ, టీజీటీల నియామకాలు జరిగాయి. నియామక ప్రక్రియలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, రాష్ట్ర/జోనల్ విధానాన్ని పక్కాగా అమలు చేశారు. వీరందరికీ విద్యాశాఖ రెగ్యులర్ పే-స్కేల్స్ ఇస్తూ, ఎప్పటికప్పుడు పీఆర్‌సీ ప్రయోజనాలను కల్పిస్తున్నారు. సాధారణ ఉద్యోగుల తరహాలోనే ఇంక్రిమెంట్లు, డీఏలు మంజూరు చేస్తున్నారు. వీరికి స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, ఫండమెంటల్ రూల్స్, తెలంగాణ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ అన్నీ వర్తిస్తున్నాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని కూడా వీరికి వర్తింపజేశారు.

విద్యాశాఖలో విలీనం చేయడం ఉత్తమం

రెగ్యులర్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని నియమ నిబంధనలను తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్లకు సైతం వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో సమానంగా విధులను నిర్వర్తిస్తూ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. మోడల్ స్కూల్ టీచర్లను విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు కింద జీతాలు చెల్లించాలనే డిమాండ్‌ని నెరవేరిస్తే ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదు. పైగా, సొసైటీ నిర్వహణ ఖర్చులు తప్పుతాయి. ప్రభుత్వానికి ఆమేరకు ఆర్థికంగా కూడా ప్రయోజనమే. ఈ కారణాల దృష్ట్యా మోడల్ స్కూల్ టీచర్ల డిమాండ్ అత్యంత హేతుబద్ధమైనది. వచ్చే ఏడాది ఇంటర్మీడియట్ బోర్డుని రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయనున్న నేపథ్యంలో మోడల్ స్కూల్స్‌ని సైతం పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయడమనేది మంచి నిర్ణయమే అవుతుంది.

ఏపీలో అలా... టీజీలో ఇలా!

2013లో ఉమ్మడి రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే నోటిఫికేషన్, ఒకే విధమైన అర్హతలు, ఒకే రకమైన నియామక ప్రక్రియ ద్వారా టీచర్లు విధుల్లో చేరారు. ఏపీలో మోడల్ స్కూల్ టీచర్లను విద్యాశాఖలో విలీనం చేసి, 010 పద్దు వర్తింపజేస్తూ 2024 మార్చిలోనే నాటి జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. పదేళ్ల కేసీఆర్ హయాంలో మోడల్ టీచర్లు ఎదుర్కొంటున్న ఈ సమస్యను ఏ మాత్రం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడల్ టీచర్ల సమస్యలపై సమగ్ర రిపోర్ట్ సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ని ఆదేశిస్తూ ప్రభుత్వం 10 జులై, 2024న 6243 నం. మెమో జారీ చేసింది. విద్యాశాఖ అధికారులు వెంటనే డిటైల్డ్ రిపోర్టును ఆర్థికశాఖకు సమర్పించారు. దురదృష్టవశాత్తు నెలలు గడుస్తున్నా ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. తదుపరి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా మోడల్ స్కూల్ టీచర్ల ఫైల్ 344/ఏ2/బీజీ/24 నేటికీ ఆర్థిక శాఖలోనే పెండింగులో ఉంది.

సీఎం చొరవ చూపాలి!

మోడల్ టీచర్ల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుభూతితో పరిశీలించి, తక్షణమే పరిష్కరించాలి. దాదాపు మూడు వేలకు పైగా మోడల్ స్కూల్ టీచర్లకు సంబంధించిన ఫైల్ సుదీర్ఘకాలంగా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో పెండింగులో ఉండటంతో వారిలో తీవ్ర ఆందోళన, అసంతృప్తి వ్యక్తమవుతోంది. మోడల్ స్కూల్స్ టీచర్లను తక్షణమే పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలి. వీరికి 010 పద్దు కింద ప్రభుత్వ ఖజానా నుంచే నేరుగా జీతాలు చెల్లించేలా శాశ్వత పరిష్కారం చూపాలి. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఆర్థిక శాఖ అనుమతులు త్వరితగతిన లభించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి, తగిన ఆదేశాలు జారీ చేయాలి.

-మానేటి ప్రతాపరెడ్డి,

రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, TRTF

98484 81028

Next Story