ఇది పూర్తిగా అసంబద్ధం.. చిదంబరం ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం

by Naga Rani Yarlagadda |

బిహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని, అదే సమయంలో తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్లు..

ఇది పూర్తిగా అసంబద్ధం.. చిదంబరం ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని, అదే సమయంలో తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం (EC) తోసిపుచ్చింది. బిహార్‌లో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను తమిళనాడుతో పోల్చడం సరికాదని, తమిళనాడులో ఇంతవరకు ఎస్‌ఐఆర్ నిర్వహించలేదని ఈసీ స్పష్టం చేసింది.

చిదంబరం ఎక్స్ లో చేసిన పోస్టులో, బిహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఉండగా, తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్ల సంఖ్య పెరిగిందని, ఇది ఆందోళన కలిగించే అంశమని, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బిహార్‌లో లక్షలాది మంది ఓటర్లను శాశ్వతంగా వలస వెళ్లారనే కారణంతో తొలగించాలని ఎన్నికల సంఘం ఎలా నిర్ణయించిందని ఆయన ప్రశ్నించారు. ఈసీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని కూడా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం నిరాధారమైనవిగా, తప్పుదారి పట్టించేవిగా విమర్శించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, సెక్షన్ 19(బీ) ప్రకారం, ఒక నియోజకవర్గంలో నివాసం ఉన్న వ్యక్తి స్థానిక ఓటర్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటాడని ఈసీ వివరించింది.

ఉదాహరణకు తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి దిల్లీలో నివసిస్తుంటే, దిల్లీలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, అదే విధంగా బిహార్‌కు చెందిన వ్యక్తి చెన్నైలో ఉంటే అక్కడ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపింది.ఈ సందర్భంలో, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం సరికాదని ఈసీ హెచ్చరించింది. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరారనే వాదన కూడా తప్పుడు ప్రచారమని, ఆ రాష్ట్రంలో ఇంతవరకు ఓటర్ల జాబితా సవరణ జరగలేదని స్పష్టం చేసింది. అందువల్ల బిహార్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియతో తమిళనాడును జోడించడం అసంబద్ధమని ఈసీ తేల్చిచెప్పింది.

Next Story