పార్కులో మాకు స్వేచ్ఛ లేదా? యువజంట తీరుపై పెద్దల ప్రతాపం..! నెట్టింట రచ్చ!

by Ramesh Naini |

ఆహ్లాదం కోసం, కాస్తంత విశ్రాంతి కోసం ప్రజలు పార్కులకు వెళ్లడం సహజం. కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో సేదతీరేందుకు పబ్లిక్ పార్కులను ఆశ్రయిస్తుంటారు.

పార్కులో మాకు స్వేచ్ఛ లేదా? యువజంట తీరుపై పెద్దల ప్రతాపం..! నెట్టింట రచ్చ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆహ్లాదం కోసం, కాస్తంత విశ్రాంతి కోసం ప్రజలు పార్కులకు వెళ్లడం సహజం. కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో సేదతీరేందుకు పబ్లిక్ పార్కులను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో పార్కుల్లో జంటల ప్రవర్తన, దానికి ప్రతిగా కొందరు పెద్దలు చేస్తున్న హెచ్చరికలు తరచూ వివాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఓ పబ్లిక్ పార్కులో విశ్రాంతి తీసుకుంటున్న యువజంటపై కొందరు వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ పబ్లిక్ పార్కులో ఒక యువతి, యువకుడు గడ్డిపై పడుకుని సేద తీరుతున్నారు. ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. చుట్టూ జనం ఉన్నప్పటికీ తమ లోకంలో తామున్నారు. అయితే, వారి ప్రవర్తన నచ్చని కొందరు వ్యక్తులు (పెద్దలు) వారి వద్దకు వెళ్లారు. బహిరంగ ప్రదేశంలో ఇలా పడుకోవడం, ప్రవర్తించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిపై దురుసుగా ప్రవర్తించారు. పబ్లిక్ ప్లేస్‌లో పద్ధతిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.

వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యం..

ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నెటిజన్లు ఈ ఘటనపై రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ నెటిజన్లు యువజంటకు మద్దతుగా నిలుస్తున్నారు. మేజర్లు అయిన ఇద్దరు వ్యక్తులు, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా మాట్లాడుకుంటే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ 'మోరల్ పోలీసింగ్' (Moral Policing) అని, పాతకాలపు ఆలోచనలతో యువత స్వేచ్ఛను హరించడం సరికాదని మండిపడుతున్నారు. అనవసరంగా జోక్యం చేసుకోవడం మానేసి, వారి పని వారు చూసుకుంటే మంచిదని పెద్దలకు చురకలు అంటిస్తున్నారు.

కనీస సభ్యత పాటించాలి

మరో వర్గం మాత్రం పెద్దల చర్యను సమర్థిస్తోంది. పార్కులు అనేవి కుటుంబాలు, చిన్న పిల్లలు వచ్చే ప్రదేశాలని, అక్కడ కనీస సభ్యత పాటించాలని సూచిస్తున్నారు. ఇంట్లో కూర్చోవాల్సిన విధంగా పార్కుల్లో పడుకోవడం, అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కొనసాగుతున్న చర్చ మొత్తానికి ఈ ఘటన.. ‘బహిరంగ ప్రదేశాల్లో ప్రవర్తన’ వర్సెస్ ‘వ్యక్తిగత స్వేచ్ఛ’ అనే అంశంపై మరోసారి జోరుగా చర్చకు తెరలేపింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనలు మారాలని యువత కోరుతుంటే, సంప్రదాయాలు, పద్ధతులు ముఖ్యమని పెద్దలు వాదిస్తున్నారు.

Next Story