ఏక్‌నాథ్ షిండేకు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

by Ramesh Naini |

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ మార్గమధ్యంలో తుఫాను, ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోవడంతో అత్యవసరంగా ముంబైకి వెనుదిరిగింది.

ఏక్‌నాథ్ షిండేకు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ మార్గమధ్యంలో తుఫాను, ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోవడంతో అత్యవసరంగా ముంబైకి వెనుదిరిగింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఒక పార్టీ కార్యకర్త ఇంట జరిగే వివాహానికి హాజరయ్యేందుకు షిండే గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబైలోని మహాలక్ష్మి రేస్‌కోర్స్ నుంచి థానేలోని ముర్బాద్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరారు. మార్గమధ్యంలో హెలికాప్టర్ ఐరోలికి చేరుకోగానే, భారీ తుఫాను ముంచుకొస్తున్నట్లు పైలట్ గమనించారు. వెంటనే అప్రమత్తమై షిండేకు పరిస్థితి వివరించి, ముందుకు వెళ్లడం ప్రమాదకరమని, వెనుదిరగడమే సురక్షితమని సూచించారు. పైలట్ సమయస్ఫూర్తితో హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించి ముంబై (జుహు)లోని ‘పవన్ హన్స్’ హెలిప్యాడ్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ప్రయాణికులంతా సురక్షితం..

ఈ ప్రయాణంలో షిండేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్ కాలే, ప్రత్యేక కార్యనిర్వహక అధికారి బాల్‌సింగ్ రాజ్‌పుత్, మీడియా సలహాదారు వినయ్ పతృద్కర్ ఉన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని షిండే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, రాష్ట్రంలోని థానే, మరాఠ్వాడా తదితర జిల్లాల్లో గత రెండు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి.

గతంలోనూ ఇలాగే..

ఇటీవలి కాలంలో షిండే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇలా వాతావరణ అనుకూలించక వెనుదిరగడం ఇది మూడోసారి. అక్టోబర్ 2024లో, అలాగే అక్టోబర్ 2023లోనూ సతారా జిల్లాకు వెళ్తుండగా వాతావరణం ప్రతికూలించడంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు వెనుదిరిగాయి. ఇక, జనవరి 28న పూణే జిల్లా బారామతికి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా మరో నలుగురు మరణించిన విషయం తెలిసిందే.

Next Story