ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గ్రూపు ఐ ప్యాక్ పై ఈడీ రెయిడ్స్.. దేశ రాజకీయాల్లో దుమారం

by Prasad Jukanti |

ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గ్రూప్ ఐ ప్యాక్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మెరుపు దాడి జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గ్రూపు ఐ ప్యాక్ పై ఈడీ రెయిడ్స్.. దేశ రాజకీయాల్లో దుమారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గ్రూప్ ఐ ప్యాక్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మెరుపు దాడి (ED Raids) పశ్చిమ బెంగాల్ లో (West Bengal Politics) తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇవాళ ఉదయం నుంచి ఐ ప్యాక్ (IPAC) సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం సహా ఐ ప్యాక్‍కు సంబంధిచిన పలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కోల్‍కతా సహా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఓ వైపు ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐ ప్యాక్ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్లడం రాజకీయం రచ్చకు దారి తీసింది. గతంలో పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు పొలిటికల్ కన్సల్టెన్సీగా సేవలు అందించిన ఐ ప్యాక్ సంస్థ పశ్చిమబెంగాల్‍లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి సైతం సేవలు అందిస్తోంది. అంత మాత్రమే కాకుండా ప్రతీక్ జైన్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఐటీ సెల్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో వెస్ట్ బెంగల్‍లో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ అధికార టీఎంసీ‍కి రాజకీయ వ్యూహరచన చేస్తున్న ఐ ప్యాక్ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
కేంద్రంపై మమతా ఫైర్:

ఓ వైపు సోదాలు జరుగుతున్న సమయంలోనే ప్రతీక్ జైన్ నివాసం వద్దకు వెళ్లిన సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అక్కడ మాట్లాడుతూ కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సోదాలు రాజ్యాంగ విరుద్ధం అని రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారని మండిపడ్డారు. మా ఎన్నికల డేటాను చోరీ చేశారని ఆరోపించారు. 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఐయామ్ సారీ.. ప్లీజ్ మీ హోం మంత్రిని కంట్రోల్ లో పెట్టుకోండి. మీరు (బీజేపీ) మాతో రాజకీయంగా పోటీ చేయకపోతే మరి బెంగాల్ కు ఎందుకు వస్తున్నారు? ప్రజాస్వామ్య పద్ధతిలో మమ్మల్ని ఓడించండి అంతే తప్ప దర్యాప్తు సంస్థలను ఉపయోగించి మా పత్రాలు, మా వ్యూహాలు, మా ఓటర్లు, మా డేటా, మా బెంగాల్‌ను దోచుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఈ విధంగా చేస్తే మీరు ఇప్పటివరకు గెలుచుకుంటున్న సీట్ల సంఖ్య కూడా చివరికి సున్నాకే పరిమితం అవుతారని హెచ్చరించారు.

బీజేపీ కౌంటర్:

రెయిడ్ కొనసాగుతున్న సమయంలో సీఎం మమతా బెనర్జీ ప్రతీక్‌ జైన్‌ నివాసానికి సీఎం వెళ్లడంపై పశ్చిమబెంగాల్‌ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం తీరు దర్యాప్తులో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే అవుతుందన్నారని ఆరోపించారు. సీఎం ప్రవర్తన అనైతికం అని విమర్శించారు.

Next Story