Ed Raids: అండమాన్ నికోబార్ దీవుల్లో తొలిసారి ఈడీ సోదాలు

by B.Srinivas |

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అండమాన్ నికోబార్ దీవుల్లో తొలిసారిగా దాడులు నిర్వహించింది.

Ed Raids: అండమాన్ నికోబార్ దీవుల్లో తొలిసారి ఈడీ సోదాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అండమాన్ నికోబార్ (Andaman nicobar) దీవుల్లో తొలిసారిగా దాడులు నిర్వహించింది. అండమాన్ నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (ANSCB)లో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం కేసు దర్యాప్తునకు సంబంధించి గురువారం పోర్ట్ బ్లెయిల్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో భాగంగా బ్యాంకింగ్ అవకతవకలను సూచించే అనేక కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నియమాలు, మార్గదర్శకాలను విస్మరించి బ్యాంకు షెల్ కంపెనీలకు, నకిలీ సంస్థలకు భారీ రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలను ఇచ్చినట్టు పత్రాల్లో ఉందని వెల్లడించారు.

అండమాన్ నికోబార్ దీవులకు చెందిన మాజీ ఎంపీ, ఏఎన్ఎస్‌సీబీ వైస్-చైర్మన్‌గా పనిచేసిన శ్రీ కుల్దీప్ రాయ్ శర్మ ప్రయోజనాల కోసం నిధులను మళ్లించడానికి దాదాపు 15 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఈ సంస్థలు మోసపూరితంగా రూ. 200 కోట్లకు పైగా రుణ సదుపాయాలను పొందాయని, అందులో ఎక్కువగా నగదు రూపంలో ఉపసంహరించుకుని శర్మతో సహా లబ్ధిదారులకు అందజేశారని తెలిపింది. అండమాన్ నికోబార్ పోలీసులు ఏఎన్ఎస్‌సీబీ అధికారులపై ఎఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈడీ దర్యాప్తు ప్రారంభించడం గమనార్హం.

Next Story