రేషన్ కుంభకోణం కేసు.. నటి, మాజీ ఎంపీ నుస్రత్ జహాన్‌కు ఈడీ నోటీసులు

by Kema Shiva Kumar |

రేషన్ కుంభకోణం కేసులో మాజీ ఎంపీ, ప్రముఖ నటి నుస్రత్ జహాన్‌కు ఈడీ నోటీసలు జారీ చేసింది.

రేషన్ కుంభకోణం కేసు.. నటి, మాజీ ఎంపీ నుస్రత్ జహాన్‌కు ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రేషన్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ మేరకు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ (TMC) మాజీ ఎంపీ, ప్రముఖ నటి నుస్రత్ జహాన్‌ (Nusrat Jahan)కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 22న కోల్‌కతాలోని ఈడీ జోనల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఆమెను ఆదేశించారు. అక్రమంగా మళ్లించిన సొమ్ముతో నుస్రత్ జహాన్‌కు ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా..? అనే కోణంలో అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు.

అసలు స్కామ్ ఏంటంటే..?

పశ్చిమ బెంగాల్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం, గోధుమలను బహిరంగ మార్కెట్‌కు మళ్లించి, కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంతో ముడిపడి ఉన్న కొన్ని సంస్థల ఖాతాల నుంచి నుస్రత్ జహాన్‌కు నగదు బదిలీ అయినట్లుగా అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు కీలక నేతలు, వ్యాపారవేత్తలు విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా మాజీ ఎంపీ అయిన నుస్రత్ జహాన్‌కు ఈడీ నోటీసులు అందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Next Story