Ranya Rao: రన్యా రావు కేసులో కర్ణాటక హోం మంత్రి ట్రస్టుకు సంబంధాలు

by S Gopi |

ఆమె క్రెడిట్ కార్డుకు మంత్రికి చెందిన విద్యా ట్రస్ట్ ద్వారా అనుమానాస్పద రూ. 40 లక్షల చెల్లింపులు జరిగినట్లు కనుగొన్నారు.

Ranya Rao: రన్యా రావు కేసులో కర్ణాటక హోం మంత్రి ట్రస్టుకు సంబంధాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కన్నడ నటి రన్యా రావు ప్రమేయం ఉన్న బంగారం స్మగ్లింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక పురోగతిని సాధించింది. ఆర్థిక అవకతవకలతో పాటు మనీలాండరింగ్‌కు సంబంధించి కీలకమైన నెట్‌వర్క్‌ను ఈడీ కనుగొంది. రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వరతో సంబంధం ఉన్న తుమకూరులోని ఒక మెడికల్ కాలేజీపై బుధవారం ఈడీ దాడులు చేసింది. ఆమె క్రెడిట్ కార్డుకు మంత్రికి చెందిన విద్యా ట్రస్ట్ ద్వారా అనుమానాస్పద రూ. 40 లక్షల చెల్లింపులు జరిగినట్లు కనుగొన్నారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీకి కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి పరమేశ్వర దాకా వెళ్లింది.

నిఘా సమాచారం, ఫైనాన్షియల్ ట్రయల్ ఆధారంగా.. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో భాగమైనట్టు అనుమానం ఉన్న వ్యక్తులు, సంస్థలకు చెందిన 16 ప్రదేశాలలో ఈడీ సోదాలు నిర్వహించింది. వీటిలో హవాలా ఆపరేటర్లు, షెల్ కంపెనీలు, అక్రమ నిధులను కూడబెట్టడంలో పాల్గొన్న ట్రస్టులు ఉన్నాయి. రన్యా రావు ద్వారా స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని సేకరించినట్లు చాలామంది హవాలా ఆపరేటర్లు అంగీకరించారు. నకిలీ కన్సల్టెన్సీ చెల్లింపులు, వ్యాపార లావాదేవీల ముసుగులో రన్యా రావు వివిధ కంపెనీల నుంచి భారీ మొత్తాలను అందుకున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఓ సంస్థ ఆమె పేరును నిర్మాణ కార్మికుల సరఫరా చేసేవారి జాబితాలో చేర్చి, ఆమె ఖాతాకు కోట్లాది రూపాయలు బదిలీ చేసిందని తెలిసింది. ఇతర కంపెనీలలో కూడా ఇలాంటి నకిలీ ఇన్‌వాయిస్‌లు, నిధుల బదిలీలు వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా, రన్యా రావు క్రెడిట్ కార్డ్ బకాయిలకు హోం మంత్రికి చెందిన విద్యా ట్రస్ట్ రూ. 40 లక్షలు చెల్లించినట్టు తేలడంతో ఈ కేసు రాజకీయ మలుపు తిరిగింది. ఈడీ అధికారుల ప్రకారం, చెల్లింపులకు సంబంధించి ట్రస్ట్ ఎటువంటి వోచర్లు లేదా డాక్యుమెంటేషన్‌ను అందించలేకపోయింది. ఇక, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అనుమతి లేకుండా పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు కూడా అక్రమ విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు జరిపిన ఆధారాలను సేకరించినట్టు ఈడీ స్పష్టం చేసింది.

అయితే, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సహా కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. వాటిని నిరాధారమైనవిగా పేర్కొన్నారు. శివకుమార్ పరమేశ్వర అలాంటి వ్యక్తి కాదని, మంత్రి ఎలాంటి నేర వ్యవహారాల్లోనూ పాల్గొనలేదని వెల్లడించారు.

Next Story