Robert Vadra: షికోపూర్ భూ ఒప్పందం కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్

by S Gopi |   (  Updated:2025-07-17 11:33:19  IST  )

ఆయనతో పాటు మరికొందరిపై స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Robert Vadra: షికోపూర్ భూ ఒప్పందం కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని షికోపూర్‌లో భూ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఒక క్రిమినల్ కేసులో వాద్రాపై దర్యాప్తు సంస్థ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఈ వ్యవహారంలో వాద్రాను మూడురోజుల పాటు ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది. ఆయనతో పాటు మరికొందరిపై స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే, రాబర్ట్ వాద్రా, అతనికి చెందిన అనుబంధ సంస్థలతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.37.64 కోట్లకు పైగా విలువైన 43 స్థిరాస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసినట్టు అధికారులు తెలిపారు. అధికారిక వివరాల ప్రకారం, గురుగ్రామ్‌లోని హర్యానాలోని మనేసర్-షికోహ్‌పూర్ (ఇప్పుడు సెక్టార్ 83)లో జరిగిన భూ ఒప్పందం జరిగింది. 2008, ఫిబ్రవరి నాటి ఈ ఒప్పందంలో భాగంగా షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి వాద్రా గతంలో డైరెక్టర్‌గా ఉన్న స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

నాలుగేళ్ల తర్వాత 2012, సెప్టెంబర్‌లో ఆ కంపెనీ సదరు భూమిని రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్‌కి రూ.58 కోట్లకు విక్రయించింది. 2012 అక్టోబర్‌లో హర్యానా ల్యాండ్ కన్సాలిడేషన్ అండ్ ల్యాండ్ రికార్డ్స్-కమ్-ఇన్‌స్పెక్టర్-జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ హర్యానా డైరెక్టర్ జనరల్‌గా నియమించబడిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఈ లావాదేవీని నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో ఈ భూ ఒప్పందం వివాదంలో చిక్కుకుంది. అయితే, రాబర్ట్ వాద్రా మాత్రం ఎప్పటికప్పుడు ఈ ఆరోపణలను ఖండించారు. ఈ కేసు తనపై, తన కుటుంబంపై రాజకీయ ప్రతీకారంలో భాగంగానే వేశారని విమర్శించారు. ఈ వ్యవహారానికి సంబంధించి 2018, సెప్టెంబర్‌లో వాద్రాపై కేసు నమోదైంది. ఇందులో వాద్రాతో పాటు అప్పటి హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ డీఎల్‌ఎఫ్‌, ఓ ప్రాపర్టీ డీలర్‌ పేర్లను చేర్చారు.

Next Story