ఆధార్ ప్రాథమిక గుర్తింపు కాదు..ఓటు హక్కు కోసం ఆధార్ సరిపోదు!

by Phanindra |

ఆధార్ ప్రాథమిక గుర్తింపు కాదని, ఓటు హక్కు కోసం పౌరసత్వానికి ధ్రువపత్రంగా ఆధార్ సరిపోదని ఈసీ తేల్చిచెప్పింది.

ఆధార్ ప్రాథమిక గుర్తింపు కాదు..ఓటు హక్కు కోసం ఆధార్ సరిపోదు!
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలోనే ఎన్నికలకు వెళ్లనున్న బిహార్ సహా దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ రోల్స్‌ను కఠినంగా రివిజన్ చేయాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయం రాజకీయ దుమారం రేపింది. ఓటర్ల జాబితా నుంచి భారతీయులు కాని వారిని ఏరిపారేయాలని ఈసీ ప్రయత్నిస్తోంది. అయితే అసలు భారతీయులు కాని వారికి ఓటు హక్కు ఎలా వచ్చిందనేది ప్రశ్న. దీనికి ప్రధాన కారణం ఫామ్ 6 లోని ఒక ప్రధాన సమస్య. దీని ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీని కోసం తాము భారతీయులమే అని నిరూపించుకోవడానికి వారు ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు బిహార్‌లో ఓటర్లు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ధ్రువపత్రాలు సమర్పించాని ఈసీ కోరింది. దీని కోసం మొత్తం 11 డాక్యుమెంట్ల జాబితాను కూడా విడుదల చేసింది. అయితే వీటిలో ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్సులు లేవు. ఎందుకంటే ఇవన్నీ ఐడెంటిటీ ప్రూఫ్స్.. అంతేకానీ పౌరసత్వాన్ని నిరూపించవు. ఈ నిర్ణయంపై పలు రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆధార్‌ను ఈసీ ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నాయి.

అయితే ఆధార్ వల్ల డూప్లికేట్ ఓట్లను కట్టడి చేయొచ్చు కానీ, అక్రమ వలసదారులు కూడా చాలాచోట్ల ఆధార్ కార్డు పొంది ఓటర్లుగా చేరారని, కాబట్టి ఆధార్‌తో పౌరసత్వం నిరూపితం కాదని నిపుణులు అంటున్నారు. ఆధార్ చట్టంలో కూడా ఈ కార్డుతో భారత పౌరసత్వం నిరూపితం అవుతుందని ఎక్కడా చెప్పలేదని, కాబట్టి దీన్ని ఓటు హక్కు కల్పించడానికి అంగీకరించలేమనేది నిపుణుల వాదన.

తొలిసారి ఓటర్లను సాధ్యమైనంత వేగంగా నమోదు చేసే ప్రక్రియలో ఫామ్ 6లోని లూప్‌హోల్‌ను ఇంతకాలం చాలామంది వాడుకున్నారని, ఇప్పటికైనా ఈ ప్రక్రియను కొంత కఠినతరం చేయాలని, భారతదేశ భవిష్యత్తును భారతీయులే నిర్ణయించాలని కానీ.. అక్రమ వలసదారులు కాదని కొందరు అంటున్నారు. ఈ సమస్యపై ఇటీవల స్పందించిన యూఐడీఏఐ సీఈవో భువనేశ్ కుమార్ కూడా ఆధార్ ఎప్పుడూ ప్రాథమిక గుర్తింపు కాదని స్పష్టంచేశారు.

దివ్యాంగులకు నైపుణ్య శిక్షణకు ఆధార్..

ఇలా ఆధార్‌పై వాదోపవాదాలు జరుగుతున్న ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు నైపుణ్య శిక్షణ అందించే ‘నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్’ స్కీం లబ్ది పొందాలంటే ఆధార్ తప్పనిసరి చేసింది. లేదా ఈ స్కీంకు దరఖాస్తు చేసినట్లు ఆధారాలు చూపిస్తేనే స్కీం ఫలాలు అందుతాయని పేర్కొంది. అయితే ఆధార్ లేకపోవడం, ఆథెంటికేషన్ వైఫల్యం వల్ల ఏ అర్హుడికీ అన్యాయం జరగకుండా చూసుకుంటామని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ స్పష్టంచేసింది.

Next Story