ఓట్ల దొంగలను ఈసీ రక్షిస్తోంది: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-18 06:35:30  IST  )

దేశంలో ‘ఓట్ల చోరీ’పై హైడ్రోజన్‌ బాంబ్‌ పేలుస్తానంటూ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చిన లోక్‌సభా పక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇవాళ మీడియా ముందుకు వచ్చారు.

ఓట్ల దొంగలను ఈసీ రక్షిస్తోంది: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ‘ఓట్ల చోరీ’పై హైడ్రోజన్‌ బాంబ్‌ పేలుస్తానంటూ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చిన లోక్‌సభా పక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. ఇవాళ ఢిల్లీ (Delhi)లోని ఇందిరా భవన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల దొంగతనంతోనే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చందని ఆరోపించారు. తాను పేల్చబోయే ‘హైడ్రోజన్ బాంబు’ను చూసి బీజేపీ నేతల్లో వణుకు మొదలైంని అన్నారు. ‘ఓట్ చోరీ’ పార్టీని రాబోయే రోజుల్లో ఎలాగైన గద్దె దింపుతామని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ ఫోన్ నెంబర్ల ద్వారా అక్రమంగా ఓట్లను తొలగించారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో రాహుల్ గాంధీ వివరించారు.

మైనార్టీలు, ఆదివాసీల ఓట్లే టార్గెట్..

ఉద్దేశపూర్వకంగానే దేశంలో లక్షలాది ఓట్లను తొలగించారని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. చాలా చోట్ల మైనార్టీలు, ఆదివాసీల ఓట్లనే ఎక్కువ రిమూవ్ చేస్తున్నారని తెలిపారు. కర్నాటక (Karnataka) అసెంబ్లీలో అదే జరిగిందని అన్నారు. ఆ రాష్ట్రంలో ఓటర్లకు లింక్ చేసిన ఫోన్ నెంబర్లు అన్ని తప్పడువేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి బలమున్న నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు జరగిందని అన్నారు. ఇవన్నీ ఆరోపణలు కాదని.. పక్కా ఆధారాలతో చెబుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు..

దేశంలో ఓట్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gnanesh Kumar) టార్గెట్‌గా రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు. అధికారులకే తెలియకుండా ఓటరు లిస్టు నుంచి ఓట్లు ఎలా మాయం అవుతాయని మహారాష్ట్రలోని రాజూర అసెంబ్లీ నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్ల జోడింపు అంశంపై ప్రశ్నించారు. సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏర్పాటు చేసి పక్కా ప్లాన్ ప్రకారం ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. తమకు ఓట్ల తొలగింపు ఐడీల వివరాలు, ఓటీపీలు ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

18 నెలలు.. 18 లేఖలు

కర్ణాటకలో ఓట్ల తొలగింపుపై సీఐడీ (CID) ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈసీకి కర్ణాటక సీఐడీ 18 నెలల్లో 18 లేఖలు రాసిందని.. కానీ అక్కడ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఓటరు ఎక్కడి నుంచి ఓటు కోసం దరఖాస్తు చేశాడో ఐపీ నెంబర్లు (IP Numbers) ఇవ్వాలని సీఐడీ కోరిందని.. ఆ ఫోన్లు ఏ ప్రాంతం నుంచి ఆపరేట్ చేశారో వివరాలను ఇవ్వాలని సీఐడీ, ఈసీకి విజ్ఞప్తి చేసిందన్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా ఈసీ స్పందించి వివరాలను వారంలోకి ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ఏది ఏమైనా ఓట్ల దొంగలను ఎన్నికల సంఘం రక్షిస్తోందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల వ్యవస్థలో అక్రమాలను ఇక కోర్టులు పరిశీలించాలని అన్నారు. ఓట్ల చోరీపై న్యాయ వ్యవస్థ దృష్టి సారించాలని.. కర్నాటక, మహారాష్ట్ర, యూపీ, హర్యానాలో ఒకే రీతిలో ఓట్ల తొలగింపు జరిగిందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థ పని చేయడం లేదని.. అందుకే ప్రతిపక్ష నేతగా తాను ‘ఓట్ల చోరీ’ అంశాన్ని ప్రజల ముందు పెడుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు.

Next Story