- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Earth Temperature: భూతాపం 1.5 డిగ్రీలు దాటిపోయే ప్రమాదం
ఇప్పటికైనా మానవాళి భూతాపానికి తగ్గించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ మానవాళి కొత్త ప్రమాదంలోకి పడబోతోంది. 2015లో పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపం 1.5 డిగ్రీలకు మించకుండా చూసుకోవాలంటూ ప్రపంచదేశాలు పారిస్‌లో ఒప్పందం చేసుకున్నాయి. కాని అది అమలు కాకపోవడంతో ఆ పరిమితి దాటేస్తున్నామని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉన్నారు. భారత్‌తో పాటు చాలా దేశాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతల ప్రభావం కనిపిస్తోంది. ఎండాకాలం అధిక ఉష్ణోగ్రతలు, వానాకాలం వరదలు, శీతల దేశాల్లో నదులు ఎండిపోవడం, ఎడారి దేశాల్లో వరదలు లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా మానవాళి భూతాపానికి తగ్గించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) 2025-2029 కాలానికి సగటు ప్రపంచ ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు స్థాయిలను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు 70 శాతం ఉన్నాయని బుధవారం తన కొత్త నివేదికలో తెలిపింది. రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక ఏడాది 2024 కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం 80 శాతం ఉందని పేర్కొంది. ఇది రికార్డు స్థాయిలో అత్యంత వేడిగా ఉండటంతో పాటు, 2024 ఏడాది 1850-1900 బేస్‌లైన్ కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ దాటి ఎక్కువ ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కలిగిన మొదటి క్యాలెండర్ సంవత్సరంగా ఉండనుంది. 2015 నాటి పారిస్ ఒప్పంద సమయంలో మరో 20 లేదా 30 ఏళ్లలో 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితి దాటవచ్చని అంచనా వేశారు. కానీ, శిలాజ ఇంధనాల విపరీత వినియోగం వంటి మానవ చర్యల కారణంగా వాతావరణంపై గణనీయమైన ప్రభావం వల్ల ముందుగానే అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని చూస్తున్నాం.
2025-2029 మధ్య ప్రతి సంవత్సరం సగటు ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రత 1850-1900 మధ్య ఉన్న దానికంటే 1.2 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని డబ్ల్యూఎంఓ నివేదిక పేర్కొంది. ఈ కాలంలోనే కనీసం ఒక ఏడాది పాటు ఉష్ణోగ్రత 1850-1900 సగటు కంటే 1.5 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండే అవకాశం 86 శాతం ఉంది. మనం రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న 10 ఏళ్ల కాలాన్ని ఇప్పటికే అనుభవించాము. తాజా దబ్ల్యూఎంఓ నివేదికలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎలాంటి సానుకూల అంచనాలను పేర్కొనలేదు. దీనర్థం భవిష్యత్తులో దేశాలు, మానవాళి దైనందిన జీవితాలు, పర్యావరణ వ్యవస్థ, భూగ్రహం మీద పెరుగుతున్న ప్రతికూల ప్రభావం కొనసాగుతుందని డబ్ల్యూఎంఓ డిప్యూటీ సెక్రటరీ జనరల్ కో బారెట్ అన్నారు.
ఆ దేశాలు నిధులిస్తాయా?
2009లో కోపెన్‌హ్యాగన్ వేదికగా జరిగిన కాప్ సదస్సులో వివిధ దేశాలు కలిసి ఒప్పందం చేసుకున్నాయి. పారిశ్రామికీకరణ ద్వారా లాభపడిన అమెరికా, యూరప్ దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలనుకునే దేశాలకు 15 ఏళ్లపాటు ఏటా 100 బిలియన్ డాలర్ల సాయం చేయాలని నిర్ణయించాయి. అయితే, ఆయా దేశాలు ఇవ్వాల్సిన నిధులను కేటాయించలేదు. 2020 నుంచి నాలుగేళ్లు మాత్రమే ఇచ్చాయి. దాంతో గతేడాది నవంబరు 11-22 తేదీల్లో అజర్‌బైజాన్ వేదికగా జరిగిన కాప్-29 సదస్సులో ఈ అంశమే ప్రధానంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు ఏటా 100 బిలియన్ డాలర్లు కాకుండా 'క్లైమేట్ ఫైనాన్స్' పేరున ఏడాదికి 1,000 బిలియన్ డాలర్ల చొప్పున ఇవ్వాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేశాయి. చివరికి ఏటా 300 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. కానీ, 2015-24 మధ్య 100 బిలియన్ డాలర్లు ఇవ్వని దేశాలు ఇప్పుడు 300 బిలియన్ డాలర్లు మాత్రం ఇస్తాయా? అనేది ప్రశ్నార్థకం.
1.5 డిగ్రీల దాటితే ఏమవుతుంది?
భూతాపం 1.5 డిగ్రీల పరిమితి దాటిపోతే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి కొన్ని రకాల సముద్ర జీవులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తాయి. దానివల్ల సముద్ర జీవావరణం దెబ్బతినే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లలేని జీవులు, పగడపు దీవులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని దీవులు మునిగిపోవచ్చు. సముద్ర పర్యావరణం హాని కారణంగా ఆహార సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా ప్రపంచ దేశాలకు ఏటా 11 ట్రిలియన్ డాలర్ల నష్టం తప్పేలా లేదు.






