- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Earthquake: మయన్మార్‌లో తీవ్ర విషాదం.. 1644 మంది మృతి
మయన్మార్‌లో సంభవించిన శక్తి వంతమైన భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఈ పెను విపత్తు వల్ల 1644 మంది ప్రాణాలు కోల్పోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్ (Myanmar)లో సంభవించిన శక్తి వంతమైన భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఈ పెను విపత్తు వల్ల 1644 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3400 మంది తీవ్రంగా గాయపడ్డట్టు మయన్మార్ సైనిక ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయని తెలిపింది. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. మృత దేహాలు, గాయపడిన వారిని శిథిలాల నుంచి వెలికి తీస్తున్నారు. రోడ్లు, వంతెనలు కూలిపోవడంతో పలు ప్రాంతాలకు రెస్క్యూ సిబ్బంది వెళ్లలేకపోతున్నట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మండలేలో అత్యంత తీవ్రమైన నష్టం కలిగింది. అయితే శనివారం మధ్యాహ్నం మరోసారి మయన్మార్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. దీంతో అనేక ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. నిరంతర ప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని ఒక యూఎస్ సంస్థ అంచనా వేసింది.
థాయిలాండ్‌లో 10 మంది మృతి
థాయిలాండ్‌లో సంభవించిన భూకంపం వల్ల రాజధాని బ్యాంకాక్‌లో ఓ భవనం కూలిపోవడం వల్ల 10 మంది మరణించగా, 26 మంది గాయపడ్డట్టు అక్కడి అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత దేశంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని థాయ్ లాండ్ ప్రధాన మంత్రి పిటోంగ్‌టార్న్ షినవత్రా తెలిపారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం మాత్రమే కూలిపోయిందని వెల్లడించారు. బ్యాంకాక్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నందున థాయ్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నగరంలోని శిథిలాల కింద ఇంకా 40 మందికి పైగా చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
అండగా నిలిచిన ప్రపంచ దేశాలు
మయన్మార్, థాయిలాండ్‌లను ఆదుకునేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు ముందు కొచ్చాయి. మయన్మార్‌కు 100 మిలియన్ యువాన్ల విలువైన సహాయం అందించనున్నట్టు చైనా ప్రకటించింది. 2 మిలియన్ల డాలర్ల విలువైన సహాయాన్ని పంపనున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. అవసరమైతే అదనపు మద్దతు సైతం అందిస్తామని వెల్లడించింది. మయన్మార్‌లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడానికి 25 మంది చొప్పున రెండు బృందాలను పంపనున్నట్లు మలేషియా ప్రభుత్వం తెలిపింది. రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ 120 మంది రెస్క్యూ కార్మికులు, అవసరమైన సామాగ్రిని మోసుకెళ్ళే రెండు విమానాలను పంపింది. అంతేగాక ఐక్యరాజ్యసమితి సైతం మయన్మార్‌కు ఐదు మిలియన్ డాలర్ల ప్యాకేజీని అందించింది.






