Earthquake: ఆప్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం.. 5.5 తీవ్రతగా నమోదు

by B.Srinivas |

తూర్పు ఆప్థనిస్తాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 1411కు చేరుకోగా, గాయపడిన వారి సంఖ్య 3124కు చేరింది.

Earthquake: ఆప్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం.. 5.5 తీవ్రతగా నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: తూర్పు ఆప్థనిస్తాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 1411కు చేరుకోగా, గాయపడిన వారి సంఖ్య 3124 మందికి పెరిగినట్టు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం వెల్లడించారు. సుమారు 5400 ఇళ్లు ధ్వంసమయ్యాయని, అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని తెలిపారు. ప్రజలు ఎక్కువగా శిథిలాల కింద చిక్కుకున్నారని చెప్పారు. మారుమూల పర్వత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, కొన్ని కఠినమైన చోట్ల ఆటంకం కలుగుతుందని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే చాన్స్ ఉందని పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి అధికారి ఇంధిరా రత్వాట్జే ఈ ఆపరేషన్‌ను ‘రేస్ అగెనెస్ట్ టైమ్’గా అభివర్ణించారు. ఇప్పటికే అనేక సంక్షోభాలతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్తాన్‌ను మర్చిపోవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. లక్షలాది మందిని విపత్తు ప్రభావితం చేసి ఉండొచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం మరోసారి భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఆగ్నేయ ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించగా నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యంగా 34 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.

Next Story