Dwivedi: ఆర్మీకి ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్.. ఆర్మీ చీఫ్ ఉఫేంద్ర ద్వివేది

by B.Srinivas |

ఆపరేషన్ సిందూర్ టైంలో ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ తెలిపారు.

Dwivedi: ఆర్మీకి ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్.. ఆర్మీ చీఫ్ ఉఫేంద్ర ద్వివేది
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ టైంలో ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ (Upendra Dwivedi) తెలిపారు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే శత్రువులతో చెస్ ఆడామని చెప్పారు. ఐఐటీ మద్రాస్‌లో ఆదివారం జరిగిన ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ (IARC) ప్రారంభోత్సవం సందర్భంగా ద్వివేదీ ప్రసంగించారు. భారత్ పాక్ ఘర్షణ టైంలో శత్రువు కదలిక ఏమిటో తెలియదని, తాము ఏమి చేయబోతున్నామో కూడా తెలియదని చెప్పారు. దీనినే గ్రే జోన్ అంటారని తెలిపారు. పాక్ కదలిక గురించి ఎటువంటి సమాచారం లేదని అయినప్పటికీ నిర్ణయాత్మకంగా వ్యవహరించి విజయం సాధంచామన్నారు. ‘మనం చేస్తున్నది సంప్రదాయ ఆపరేషన్ కంటే తక్కువ. మనం చెస్ కదలికలు చేస్తున్నాం. పాక్ సైతం ఇదే తరహాలో వ్యవహరించింది. ఎక్కడో మనం వారికి చెక్‌మేట్ ఇస్తున్నాం. ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ శత్రువును ఎదుర్కోవడానికి ప్రయత్నించాం’ అని తెలిపారు.

‘ఏప్రిల్ 22న పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కదిలించింది. మరుసటి రోజే అందరం కలిసి డిస్కస్ చేశాం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇలా ఇక చాలు అన్నారు. ముగ్గురు ఆర్మీ చీఫ్‌లు ఏదో ఒకటి చేయాలని స్పష్టంగా సూచించారు. దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఏం చేయాలో నిర్ణయించుకోవాలని చెప్పారు. మేము మొదటిసారి చూసిన విశ్వాసం, రాజకీయ దిశానిర్దేశం ఇదే’ అని తెలిపారు. ఏప్రిల్ 25న నార్తర్న్ కమాండ్‌ను సందర్శించి అక్కడే దాడికి ప్లాన్ చేశామన్నారు. దీనిలో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలలో ఏడు స్థావరాలను ధ్వంసం చేశామని, ఇందులో చాలా మంది ఉగ్రవాదులు కూడా మరణించారని తెలిపారు. అయితే నెరేటివ్ మేనేజ్‌మెంట్‌తోనే విజయం సాధించానని పాక్ బుకాయింపు చేస్తోందని విమర్శించారు.

Next Story