ప్రాణాలు తీస్తున్న ‘డస్టింగ్’ ట్రెండ్.. వైరల్ అవ్వడం కోసం ప్రాణాలు తీసుకోవాలా?

by Phanindra |   (  Updated:2025-06-07 15:28:21  IST  )

ప్రాణాలు తీస్తున్న ‘డస్టింగ్’ ట్రెండ్. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ప్రాణాలు తీసుకోవాలా?

ప్రాణాలు తీస్తున్న ‘డస్టింగ్’ ట్రెండ్.. వైరల్ అవ్వడం కోసం ప్రాణాలు తీసుకోవాలా?
X

దిశ, నేషనల్ బ్యూరో: సోషల్ మీడియా వల్ల యువతలో పిచ్చివేషాలు మరీ ఎక్కువైపోతున్నాయి. కొన్నిసార్లు ఇవి ప్రాణాంతకంగా మారుతున్నాయి. కొంతకాలం క్రితం బ్లూవేల్, బ్లాకౌట్ వంటి ఛాలెంజులు ఎన్నో ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఛాలెంజ్ యూఎస్‌లో యువత ప్రాణాలు తీస్తోంది. దీనిపేరు ‘డస్టింగ్’. తాజాగా ఆరిజోనాకు చెందిన 19 ఏళ్ల రెన్నా ఓ రూర్కీ అనే అమ్మాయి ఈ ఛాలెంజ్ చేయబోయి ప్రాణాలు కోల్పోయింది. దీంతో శోకసంద్రంలో మునిగిన తల్లిదండ్రులు.. ‘మా అమ్మాయి ఎప్పుడూ నేను చాలా ఫేమస్ అవుతా అని చెప్పేది. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు’ అంటూ బాధపడుతున్నారు.

అసలేంటీ డస్టింగ్..?

దీన్ని క్రోమిగ్, హఫ్ఫింగ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇంట్లో వస్తువులు శుభ్రం చేయడానికి క్లీనర్లు కొంటాం కదా. ఈ క్లీనర్లను డ్రగ్స్‌లా పీల్చుకోవడమే ఈ ఛాలెంజ్. ఇలా చేస్తే కాసేపు గాల్లో తేలినట్లు ఉంటుందట. అయితే దీని వల్ల శరీరానికి చాలా నష్టం కూడా ఉంటుంది. కొన్నిసార్లు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అయినా సరే సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం రెన్నా వంటి వాళ్లు ఈ ఛాలెంజ్ స్వీకరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

తల్లి ఆవేదన..

రెన్నా మరణం గురించి, ఈ ఛాలెంజ్ గురించి ఆమె తల్లి డానా ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఈ క్లీనర్లు కొనడానికి ఐడీ అక్కర్లేదు. వాసన రాదు. ధర కూడా తక్కువ. దీంతో పిల్లలు ఈజీగా దీన్ని కొనేసి ఇలాంటి ప్రమాదకర ఛాలెంజ్‌లు చేస్తున్నారు. ఏ తల్లిదండ్రులు కూడా ఈ క్లీనర్ల గురించి డ్రగ్ టెస్టులు చెయ్యరు కదా’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ క్లీనర్‌ను పీల్చిన తర్వాత స్పృహకోల్పోయిన రెన్నా.. మల్లీ కళ్లు తెరవలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

Next Story