Dubey : దూబేపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలి.. అటార్నీ జనరల్‌కు సుప్రీంకోర్టు న్యాయవాది లేఖ

by B.Srinivas |

భారత అత్యున్నత న్యాయస్థానం తన పరిమితులను దాటి పని చేస్తోందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Dubey : దూబేపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలి.. అటార్నీ జనరల్‌కు సుప్రీంకోర్టు న్యాయవాది లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అత్యున్నత న్యాయస్థానం తన పరిమితులను దాటి పని చేస్తోందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikanth debe) ఇటీవల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. దూబేపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme court) న్యాయవాది అనాస్ తన్వీర్ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి లేఖ రాశారు. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించడానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు గౌరవాన్ని తగ్గించే ఉద్దేశ్యంతోనే దూబే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దూబే కామెంట్స్ చాలా అభ్యంతరకరంగా, ప్రమాదకరరీతిలో రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. ‘కోర్టు ధిక్కార చట్టం 1971లోని 3(c) నిబంధనతో పాటు, సెక్షన్ 15(1)(b) కింద నేను ఈ లేఖ రాస్తున్నా. ఎంపీ నిషికాంత్ దూబే బహిరంగంగా చేసిన ప్రకటనలు తీవ్రంగా ఉన్నాయి. తప్పుదారి పట్టించడంతో పాటు సుప్రీంకోర్టు గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కాగా, వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని వివాదాస్పద నిబంధనలపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత, తదుపరి విచారణ వరకు వాటిని అమలు చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దూబే స్పందిస్తూ.. ‘ఈ దేశ చట్టాలను పార్లమెంట్ రూపొందిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. పార్లమెంటుకు మీరు సూచనలు ఇస్తారా? దేశంలో అంతర్యుద్ధం ప్రారంభమైతే సీజేఐ సంజీవ్ ఖన్నా దానికి బాధ్యత వహిస్తారా’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే బీజేపీకి, దూబే వ్యాఖ్యలకు సంబంధం లేదని ఆ పార్టీ తెలిపింది.

Next Story