- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China: అమెరికాతో వాణిజ్య యుద్ధం.. భారత్ కోసం ఓ మెట్టు దిగిన చైనా
భారత్- చైనా మధ్య సంబంధాలు సానుకూలంగా పురోగతిని సాధించాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- చైనా మధ్య సంబంధాలు సానుకూలంగా పురోగతిని సాధించాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ అన్నారు. న్యూఢిల్లీ-బీజింగ్ పరస్పరం విరోధం పెంచుకొనే కంటే భాగస్వామ్యుల్లా కలిసి పనిచేయడం ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మీడియాతో మాట్లాడారు. ఆసియాలోనే కీలకమైన తమ రెండు దేశాల మధ్య సహకారం అత్యంత ముఖ్యమన్నారు. వాంగ్ యీ మాట్లాడుతూ..‘‘చైనా-భారత్ భాగస్వాములుగా పరస్పర విజయానికి సహకరించుకోవాలి. దీనిని సాధించడానికి డ్రాగన్-ఎలిఫెంట్ డ్యాన్స్ ఒక్కటే ఇరుపక్షాలకు ఉన్న సరైన మార్గం’’ అని వ్యాఖ్యానించారు. ఇరుదేశాలు పరస్పరం విరోధించుకునే కంటే.. ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పరస్పర సహకారమే రెండు దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను బలోపేతం చేస్తుందన్నారు. ఇరుదేశాల మధ్య వివాదాలను దౌత్యమార్గంలో పరిష్కరించుకొంటామని.. సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి సహకారం అవసరమని వాంగ్ అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా పరిష్కారం కానీ సమస్యే లేదని.. సహకారంతో చేరుకోలేని లక్ష్యాలే లేవని చెప్పుకొచ్చారు. ఇక భారత్-బీజింగ్ మధ్య మెరుగైన సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా లబ్ధిచేకూరుస్తాయన్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి.. అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ సౌత్ స్థానాన్ని శక్తిమంతం చేస్తుందన్నారు. గత అనుభవాలను సంగ్రహించి.. వేగంగా ముందుకు సాగేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఇరుదేశాల సంబంధాలను స్థిరమైన అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందన్నారు.
జీ20 విదేశాంగ మంత్రుల భేటీ తర్వాత..
దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల భేటీలో భారత మంత్రి జైశంకర్‌తో చైనా మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. ఆ తర్వాత కొన్ని వారాల్లోనే ఈ ప్రకటనలు వెలువడ్డాయి. కాగా.. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత పలు విడతలుగా ఇరుదేశాలకు చెందిన దౌత్యవేత్తలు, సైనికాధికారులు చర్చలు జరిపారు. 2024లో ప్రధాని మోదీ-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్‌లో భేటీ అయ్యారు. ఆ తర్వాతనే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నచోట్ల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి తగ్గాయి. మరోవైపు, మరోవైపు ఈ ఏడాది షాంఘై సహకార సంస్థ సమావేశాలకు చైనా ఆతిథ్యం ఇస్తోంది. ఆ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం అత్యంత కీలకంగా మారనుంది.
అమెరికా ఎఫెక్ట్..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగుమతి సుంకాలను భారీగా పెంచారు. ప్రధానంగా కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని ప్రకటించారు. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. దీనికి చైనా కూడా అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ క్రమంలోనే చైనా ప్రస్తుత చూపులు భారత్ వైపు పడ్డాయి. భారత్ తో గతంలో ఉన్న విరోధాన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు చైనా రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఓ మెట్టు దిగి భారత్ తో పనిచేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.






