వరకట్న వేధింపులు.. నడివీధిలో కోడలిపై మామ అమానుష దాడి!

by Ramesh Naini |   (  Updated:2026-04-11 11:42:11  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ రిటైర్డ్ రైల్వే అధికారి తన కోడలిని నడివీధిలోకి ఈడ్చుకొచ్చి, బట్టలు చింపి విచక్షణారహితంగా దాడి చేశాడు.

వరకట్న వేధింపులు.. నడివీధిలో కోడలిపై మామ అమానుష దాడి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ రిటైర్డ్ రైల్వే అధికారి తన కోడలిని నడివీధిలోకి ఈడ్చుకొచ్చి, బట్టలు చింపి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలు మీనాక్షి పాండే తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి మామ రిటైర్డ్ రైల్వే అధికారి రమేష్ దూబే రూ. 20 లక్షల వరకట్నం కోసం కొన్నేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించింది. తనకు విడాకులు ఇవ్వకుండానే భర్త హిమాన్షు దూబే హిందూ వివాహ చట్టానికి విరుద్ధంగా రెండో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేసింది.

వీక్షకులను కలచివేస్తున్న వీడియో..

పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దాడి జరిగింది. ఇంటి ముందు వీధిలోకి ఈడ్చుకొచ్చి కొడుతున్న సమయంలో తనను వదిలేయాలంటూ బాధితురాలు ప్రాధేయపడిన తీరు పలువురిని కలచివేస్తోంది. అలాగే ఆ సమయంలో బాధితురాలు ధరించిన బట్టలు చిరిగిపోయి కనిపించాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు ముమ్మరం..

సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం, ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో కాన్పూర్ పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బాధితురాలు మీనాక్షి పాండే చేసిన ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తూ విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటన దేశంలో వరకట్న వేధింపులు, గృహహింస చట్టాల అమలు తీరుపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

Next Story