ఖజానా ఖాళీ అని సాకులు చెప్పొద్దు: సీఎం విజయ్‌కు స్టాలిన్ చురకలు!

by Prasad Jukanti |   (  Updated:2026-05-10 12:01:34  IST  )

తమిళనాడు అప్పులపై సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ సీఎం స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు.

ఖజానా ఖాళీ అని సాకులు చెప్పొద్దు: సీఎం విజయ్‌కు స్టాలిన్ చురకలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే (TVK) అధినేత విజయ్‌ (Vijay) ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ఆ వెంటనే గత డీఎంకే ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు రుణం మిగిల్చిందని, 2021-2026కు సంబంధించి తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు.

సాకులొద్దు:

అప్పుల విషయంలో విజయ్ చేసిన ఆరోపణలను ఆదివారం స్టాలిన్ ఎక్స్ వేదికగా తోసిపుచ్చారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందనే సాకు చెప్పి మీకు ఓటు వేసిన ప్రజలను నిరాశపరచకుండా పదవీ కాలాన్ని ప్రారంభించాలని సీఎం విజయ్‍కు సూచించారు. విజయం సాధించిన తమిళగ విట్రి కజగం నాయకుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు హృదయపూర్వక అభినందనలు, మీరు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సంతకం చేసిన ప్రకటనను కూడా నేను స్వాగతిస్తున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని వెంటనే చెప్పడం మొదలు పెట్టవద్దు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంది. కావాల్సింది దానిని ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం మాత్రమేనన్నారు. కోవిడ్ మహమ్మారి, వరదలు, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి సవాళ్లను ఎదుర్కొన్నామని అయినా తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని స్టాలిన్ గుర్తు చేశారు. ప్రస్తుతం తమిళనాడు రుణ స్థాయి అనుమతించదగిన స్థాయిలోనే ఉందన్నారు.

Next Story