Alert: భారత్ పాక్ మధ్య యుద్ధవాతావరణం.. వాట్సాప్ లో కొత్త రకం స్కామ్

by Prasad Jukanti |   (  Updated:2025-04-28 10:10:59  IST  )

ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా కేటుగాళ్లు వాట్సాప్ లో నయా స్కామ్ కు తెరలేపారు.

Alert: భారత్ పాక్ మధ్య యుద్ధవాతావరణం.. వాట్సాప్ లో కొత్త రకం స్కామ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండో-పాక్ బార్డర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన్న ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతున్నది. ఇటువంటి సమయంలో ఇండియన్ ఆర్మీ (Indian Army) సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని కొంత మంది కేటుగాళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. సైన్యం ఆధునికీకరణ (Modernization Of Army) కోసం కేంద్ర ప్రభుత్వం విరాళాలు కోరుతున్నదంటూ వాట్సాప్ లో నయా స్కామ్ కు తెరలేపారు. దీంతో ఈ ప్రచారంపై రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (Fact Check) విభాగం ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ ఇందంతా ఫేక్ ప్రచారం అని కొట్టిపారేసింది. ఆర్మీ విరాళాల కోసం ఎలాంటి బ్యాంక్ ఖాతా కూడా తెరవలేదని స్పష్టం చేసింది.

అసలేముంది ఆ సందేశంలో:

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సూచన మేరకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ మోడ్రనైజేషన్ కోసం దేశ ప్రజల నుంచి విరాళాలు కోరుతున్నది. రోజుకు ఒక రూపాయి మాత్రమే, అది కూడా భారత సైన్యం కోసం. యుద్ధంలో గాయపడిన లేదా అమరులైన సైనికుల కోసం ఒక బ్యాంకు ఖాతాను తెరిచింది. దీనిలో ప్రతి భారతీయుడు తన 1 రూపాయి నుంచి ఎంతైనా మీ విరాళం ఇవ్వండి. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే సరిపోదు. విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలి అంటూ ఓ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటి వివరాలతో ఓ సందేశం వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన రక్షణ శాఖ ఆర్మీ కోసం ఎలాంటి బ్యాంకు ఖాతా కూడా తెరవలేదని స్పష్టం చేసింది. ఇది సైబర్ నేరగాళ్ల పని అని భావిస్తున్నారు. అయితే ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో సెంటిమెంట్ తో కూడిన ఈ తరహా సందేశాల ద్వారా నకిలీ ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Next Story