భారత పర్యటనకు రానున్న డొనాల్డ్ ట్రంప్ఏ? ఏప్రిల్‌లో వచ్చే అవకాశం

by Ajay Maddhiboyina |

ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్ భారత పర్యటన ఉండనుంది. అప్పుడు వీలుకాకుంటే వేసవి కాలం తర్వాత ఆయన భారత్‌కు రావొచ్చని సమాచారం.

భారత పర్యటనకు రానున్న డొనాల్డ్ ట్రంప్ఏ? ఏప్రిల్‌లో వచ్చే అవకాశం
X

దిశ, నేషనల్ బ్యూరో:

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తన సలహాదారులతో ఇండియా టూర్ విషయమై చర్చలు కూడా జరిపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చైనాలో పర్యటించడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఆ దేశంతో మరింత లోతైన సంబంధాలు ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పర్యటన ఉండబోతోంది. ఎన్నికల ప్రచార సమయంలో చైనాపై మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు మాత్రం ఆ దేశంతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను కూడా ఆహ్వానించారు. ఇదే సమయంలో భారత్‌తో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే వైట్ హౌస్‌లో జరుగనున్న దేశాధినేతల సమావేశానికి ప్రధాని మోడీకి ఆహ్వానం అందిందని చెబుతున్నారు. కాగా, వైట్ హౌస్‌లో జరిగే సమావేశంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ట్రంప్‌ను మోడీ ఇండియాకు ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్ భారత పర్యటన ఉండనుంది. అప్పుడు వీలుకాకుంటే వేసవి కాలం తర్వాత ఆయన భారత్‌కు రావొచ్చని సమాచారం. కాగా ట్రంప్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఇండియా తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ హాజరు కానున్నారు.

Next Story