చైనా, భారత్‌పై కోపం.. అమెరికాలోని విదేశీయులపై ట్రంప్ కొరడా?

by Phanindra |   (  Updated:2025-08-22 17:50:06  IST  )

చైనా, భారత్‌పై కోపంతో అమెరికాలోని విదేశీయులపై ట్రంప్ కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అవుతున్నారు. ఫ్లోరిడా యాక్సిడెంట్ వంకతో అందర్నీ టార్గెట్ చేస్తున్నారు.

చైనా, భారత్‌పై కోపం.. అమెరికాలోని విదేశీయులపై ట్రంప్ కొరడా?
X

దిశ, నేషనల్ బ్యూరో: అవకాశం దొరకగానే.. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారు, ప్రత్యర్థులు అందరిపైనా పగతీర్చుకోవడం యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అలవాటు. తన విధానాలను ప్రశ్నించిన మాజీ భద్రత సలహాదారు ఇంట్లో సోదాలు చేయించడం, తన మిత్రుడు జైర్ బొల్సనారోపై కేసులు పెట్టారని బ్రెజిల్‌పై అదనపు సుంకాలు వేయడం ఇవన్నీ చూస్తే ట్రంప్‌ మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తను అరిస్తే తలవంచుకుపోవాలి తప్ప, ఎదురు తిరిగే ప్రయత్నమే ఎవరూ చేయకూడదనుకునే వ్యక్తి ట్రంప్ అని ఎంతోమంది అంటున్నారు. అలాంటి వ్యక్తికి చిన్న అవకాశం వస్తే చాలు.. తన ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడానికి. ఫ్లోరిడాలో జరిగిన ట్రక్ యాక్సిడెంట్ అలాంటిదే. ముగ్గురు మరణించిన ఈ ప్రమాదానికి.. హర్జీందర్ సింగ్ అనే భారత సంతతి పంజాబీ కుర్రాడు కారణం. అతను 2018లో యూఎస్‌కు అక్రమంగా వచ్చాడని, కాలిఫోర్నియాలో లైసెన్స్ సంపాదించాడని ఆ తర్వాత తెలిసింది.

కేవలం సాకు మాత్రమేనా?

ఇది కారణంగా చూపిస్తున్న యూఎస్ సర్కారు ట్రక్ డ్రైవర్లకు కొత్తగా లైసెన్సులు ఇవ్వబోమని ప్రకటించింది. ముఖ్యంగా విదేశీ ట్రక్ డ్రైవర్లకు లెసెన్సులు ఇవ్వడం జరగదని తెలిపింది. అంతలోనే యూఎస్‌లో ఉంటున్న 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను కూడా పరిశీలించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. టూరిస్టులు, స్టూడెంట్లు, వర్కర్లు, బిజినెస్ ట్రావెలర్లు.. ఇలా ఏ కారణంతో అయినా సరే యూఎస్‌కు వచ్చిన విదేశీయులను గుర్తించి, వీసా రద్దు చేసేందుకు ఆస్కారం ఉండే ఎలాంటి చర్యలైనా వీరు చేశారా? అని దర్యాప్తు చేసుందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. తమ దేశ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని యూఎస్ చెప్తున్నప్పటికీ.. ఈ డెసిషన్ వెనుక రాజకీయ కారణాలు లేవని చెప్పడం అతిశయోక్తే అవుతుందనేది నిపుణుల వాదన.

చైనీయులు, భారతీయులే టార్గెట్?

ఎందుకంటే.. యూఎస్‌లో అత్యధికంగా ఉండే విదేశీ జనాభా చైనా, భారత్‌కు చెందిన వారే. ఈ రెండు దేశాల్లో చైనా అంటే యూఎస్‌కు ఎప్పటి నుంచో పడదు. ఇక భారత్‌తో ఇటీవలి కాలంలో సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రష్యా చమురు కొంటున్నందుకు ట్రంప్ అదనపు సుంకాలు వేస్తే.. భారత్ బెదరకుండా రష్యాతో బంధాలను మరింత బలోపేతం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇది ట్రంప్‌కు ఏమాత్రం నచ్చలేదని ఆ దేశ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు చూస్తేనే తెలుస్తోంది. అదే సమయంలో యూఎస్ నుంచి భారీగా సోయాబీన్స్ దిగుమతి చేసుకునే చైనా కూడా.. బ్రెజిల్‌ నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకోవాలని డిసైడ్ అయింది. దీంతో ఈ రెండు దేశాలను నేరుగా ఏమీ చేయలేక.. ఇలా యూఎస్‌లో ఉంటున్న ఆ దేశ ప్రజలపై అక్కసు వెళ్లగక్కేందుకు ట్రంప్ తయారైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

వీసాలు టార్గెట్ చేయడం ఎందుకు?

నిజంగా ఫ్లోరిడా రోడ్డు ప్రమాదం వల్లనే ఈ నిర్ణయం తీసుకుంటే.. ట్రక్ డ్రైవర్లందరికీ మరోసారి లైసెన్సు టెస్టులు పెడితే సరిపోతుంది. ఇప్పటికే అక్రమంగా యూఎస్‌లో ఉంటున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్న ట్రంప్ సర్కారుకు.. లైసెన్స్ విధానాన్ని కఠినతరం చేయడం అంత కష్టమేమీ కాదు. కానీ సడెన్‌గా దేశంలోని సుమారు 5.5 కోట్ల వీసాదారులను టార్గెట్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. వీరిలో భారతీయులు సుమారు 52 లక్షల మంది ఉండగా, చైనీయులు 54 లక్షల మంది ఉంటారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ కోటి మందని టార్గెట్ చేసేందుకే ట్రంప్ సర్కారు వీసాదారులందరిపై ఫోకస్ పెడుతోందని సమాచారం.

ఏదో ఒక తప్పు చెయ్యకపోతారా?

కొత్త వీసాదారులను అడిగినట్లే వీరందరి ఎలక్ట్రానిక్ డివైజుల లాక్‌లు తీయించి చెక్ చేసినా ఆశ్చర్యం లేదు. వీరిలో ట్రంప్‌కు, యూఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారు, అలాంటి పోస్టులను లైక్, షేర్ చేసిన వారిపై కూడా గట్టి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని యూఎస్ నుంచి బహిష్కరించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఇలా తమ దేశంలో ఉన్న వారు ఏదో ఒక తప్పు చేసి దొరక్కపోతారా? అని వెతుకుతున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇప్పటికే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) నుంచి లక్షల కొద్దీ ఇమిగ్రేషన్ ట్యాక్స్ రికార్డులను సేకరించి పరిశీలించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే ఇకపై యూఎస్ వీసా తీసుకునే వారు 15 వేల డాలర్లు బాండ్‌ చెల్లించేలా ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు తెచ్చేందుకు యూఎస్ ప్రయత్నిస్తోందని సమాచారం.

Next Story