Trump: పనామా కాలువ వివాదంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పొరుగుదేశాలపై చర్యలకు దిగుతున్నారు.

Trump: పనామా కాలువ వివాదంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పొరుగుదేశాలపై చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై టారీఫ్ ల విషయంలో విరుచుకుపడ్డ ట్రంప్.. ఇప్పుడు ‘పనామా కాలువ (Panama Canal)’పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న ట్రంప్‌ (Donald Trump).. త్వరలోనే ఇందుకు సంబంధించి పరిణామాలు జరుగుతాయన్నారు. బలవంతపు చర్యలు తీసుకుంటామనే సంకేతాలిచ్చారు. ‘‘పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది. మేం దాన్ని చైనాకు ఇవ్వలేదు. కానీ, ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోంది. అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం. లేదా త్వరలోనే దీనికి సంబంధించి చర్య తీసుకోబోతున్నాం’’ అని ట్రంప్‌ మీడియాతో అన్నారు. అయితే, దీనికి బలగాల అవసరం ఉండకపోవచ్చని అన్నారు.

పనామా కాలువ ఒప్పందం

పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబరులో దీన్ని పనామాకు ఇచ్చేసింది. అయితే, అమెరికా వాణిజ్య, నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని.. వీటిని తగ్గించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇరుదేశాల మధ్య ఈ వివాదం ముదిరింది. మరోవైపు, చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు ములినో ప్రకటించారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ములినో నిర్ణయం చర్చ మారింది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించమని స్పష్టం చేశారు.

Next Story