అమెరికా పరువు తీస్తున్న ట్రంప్.. ప్రతిచోటా దౌత్యం ఫెయిల్!

by Phanindra |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశం పరువు తనే తీసుకుంటున్నారు. ఎక్కడ దౌత్యం చేసేందుకు ఆయన ప్రయత్నించినా విఫలం అవుతూనే ఉన్నారు.

అమెరికా పరువు తీస్తున్న ట్రంప్.. ప్రతిచోటా దౌత్యం ఫెయిల్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ దేశాలకు పెద్దన్న.. అగ్రరాజ్యం.. అని పేరొందిన యూఎస్.. తన పరపతి కోల్పోతుందా? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను చూస్తే అదే నిజం అనిపిస్తోంది. తాజాగా ఇరాన్‌లో అణ్వాయుధాలు తయారు చేస్తున్నారంటూ ఆ దేశంలోని మూడు న్యూక్లియర్ సైట్లపై యూఎస్ దాడులు చేసింది. దీనికి ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. ఖతార్‌లోని యూఎస్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. దీంతో యూఎస్ మరోసారి తీవ్రంగా స్పందిస్తుందని, ఇరాన్‌పై భీకర దాడులు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఆ మరుసటి రోజే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని తానే ఆపానని, రెండు దేశాల మధ్య సీజ్‌ఫైర్ చేయించానని ట్రంప్ ప్రకటించారు.

బంకర్ బస్టర్లతో ఇరాన్‌పై దాడులు చేసిన యూఎస్.. సడెన్‌గా శాంతి దూత అవతారం ఎత్తడం ఎవరికీ అర్థం కాలేదు. పోనీ.. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కుదిర్చిన ఈ సీజ్‌ఫైర్ సక్సెస్ అయిందా? అంటే అదేం లేదు. ట్రంప్ ప్రకటన చేసిన కాసేపటికే అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్.. రెండు దేశాలూ ఒకదానిపై మరొకటి దాడులు చేసుకున్నాయి. అంటే పెద్దన్న మాటంటే ఈ దేశాలకు భయం లేదనేగా? ఇదొక్కటే కాదు. గతంలో యూఎస్ ఎన్నికల సమయంలో తాను అధ్యక్షుడినైతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా 24 గంటల్లో ఆపేస్తానంటూ ట్రంప్ బీరాలు పలికారు. ఆయన ప్రమాణ స్వీకారం జరిగి ఐదు నెలలు గడిచినా.. ఆ యుద్ధాన్ని ఆపలేకపోయారు. అసలు ఆ వైపుగా ట్రంప్ చేసిన ప్రయత్నాల్లో ఆవగింజంత కూడా అభివృద్ధి లేదు.

తనను తాను ‘శాంతి దూత’ అని చెప్పుకునే ట్రంప్‌.. ఈ పరిస్థితులను దిగమింగుకోలేకపోతున్నారు. అందుకే భారత్, పాక్ యుద్ధం ఆగగానే దాని క్రెడిట్ కొట్టేయడానికి చూశారు. ఇప్పుటికీ తనే ఆ యుద్ధం ఆపానని అంటున్నారు. మధ్యలో పొరబాటున ఈ రెండు దేశాలే యుద్ధం ఆపాలని నిర్ణయం తీసుకున్నాయని చెప్పినా.. మళ్లీ వెంటనే మాట మార్చేశారు. ఇలా చేయకపోతే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆయన బాధ. ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో మరోసారి ట్రంప్ దౌత్య విధానాల్లో లోపాలు బట్టబయలయ్యాయి. ఇరాన్‌ను అణుఒప్పందానికి ఒప్పించలేకపోయారు. ఆ దేశంపై ఇజ్రాయెల్ దాడిని ఆపలేకపోయారు. చివరకు తన ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికి ఇరాన్‌పై స్వయంగా యూఎస్ మిలిటరీతో దాడులు చేయించారు. ఆ తర్వాత యూఎస్ ఎన్ని మిసైల్స్ వేసిందో అదే సంఖ్యలో మిసైల్స్ వేసి, ‘ఇది యూఎస్‌పై మా ప్రతీకార చర్య’ అని ఇరాన్ ప్రకటించింది. దీంతో పరిస్థితులు చేయిదాటి పోతాయేమో? అని అంతా భయపడ్డారు.

‘ఇరాన్ దాడులు చాలా బలహీనవైనవి, ముందుగానే సమాచారం కూడా ఇచ్చింది. కాబట్టి మేం మళ్లీ ఎలాంటి దాడులు చెయ్యం’ అంటూ మొఖాన నవ్వుపులుముకొని మీడియాకు చెప్పారు ట్రంప్. దీంతో ప్రపంచ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న మాట వాస్తవమే. కానీ అదే సమయంలో ఇంతకాలం చిన్న దేశాలను తన మిలిటరీ, వాణిజ్య శక్తి చూపించి బెదిరించిన అగ్రరాజ్యంపై ఏమూలనో ఉండే బెరుకు కూడా మాయమైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపలేదంటే.. రష్యా కూడా పెద్ద దేశం కదా అని ఊరుకున్నారు. కనీసం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కూడా ఆపలేని పెద్దన్న ఏం పవర్‌ఫుల్? అనే ఆలోచనలు చాలామంది బుర్రలో మెదిలాయి. ఇదంతా చూసిన విశ్లేషకులు.. ‘ఇప్పుడే ఇలా ఉంటే.. ట్రంప్ దిగిపోయే టైంలో యూఎస్ పరపతి ఏ స్థాయికి దిగజారుతుందో?’ అంటున్నారు.

Next Story