గ్రీన్ కార్డ్ లాటరీ వ్యవస్థ సస్పెండ్.. ట్రంప్ సంచలన నిర్ణయం

by Phanindra |

గ్రీన్ కార్డ్ లాటరీ వ్యవస్థను సస్పెండ్ చేయాలని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

గ్రీన్ కార్డ్ లాటరీ వ్యవస్థ సస్పెండ్.. ట్రంప్ సంచలన నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రౌన్ యూనివర్సిటీ, ఎంఐటీల్లో కాల్పులకు తెగబడిన వ్యక్తి గ్రీన్ కార్డ్ లాటరీ ద్వారా దేశంలోకి వచ్చినట్లు తెలియడంతో.. ఈ వ్యవస్థను పూర్తిగా సస్పెండ్ చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ విషయాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ క్రిస్టీ నోయమ్ వెల్లడించారు. ట్రంప్ ఆదేశాలతో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్‌ను గ్రీన్ కార్డ్ లాటరీ నిలిపివేయాలని తను ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు.

‘బ్రౌన్ యూనివర్సిటీ షూటర్ క్లాడియో మాన్యుయెల్ నెవ్స్ వాలెంటే.. 2017లో డైవర్సిటీ లాటరీ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రాం (డీవీ-1) ద్వారా యూఎస్‌లోకి వచ్చాడు. అతనికి గ్రీన్ కార్డు కూడా ఇచ్చారు. ఇలాంటి దుర్మార్గుడిని మన దేశంలోకి రానివ్వకుండా ఉండాల్సింది’ అని ఆమె ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ డీవీ-1 వ్యవస్థలో ఏటా యూఎస్‌లో తక్కువ జనాభా ఉన్న దేశస్థులకు 50 వేల గ్రీన్ కార్డులు అందిస్తుంది. వీరిలో చాలామంది ఆఫ్రికా నుంచి వస్తారు. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దు చేయడం కచ్చితంగా కోర్టులకు వెళ్తుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే 2025లో ఈ లాటరీ కోసం 2 కోట్ల మంది వరకు దరఖాస్తులు చేశారు. గ్రీన్ కార్డు దారులతోపాటు వారి భాగస్వాముల, డిపెండెంట్లను కూడా కలుపుకుంటే మొత్తం 1.31 లక్షల వీసాలను డీవీ-1 కింద అందజేయాల్సి ఉంది.

నిందితుడు ఆత్మహత్య?

పోర్చుగీసు వాడైన వాలెంటే.. బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులు, సిబ్బందిపై కాల్పులకు తెగబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు. ఒక ఎంఐటీ ప్రొఫెసర్ కూడా మరణించినట్లు అధికారులు చెప్పారు. గురువారం సాయంత్రం అధికారులకు వాలెంటే మృతదేహం కనిపించింది. అతను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో అధికారులు భావిస్తున్నారు.

Next Story