రష్యా చమురు ఆపేస్తే భారత్‌కు నష్టమా..?

by Phanindra |

రష్యా చమురు ఆపేస్తే భారత్‌కు నష్టమా..? ప్రస్తుత పరిస్థితుల్లో తగ్గించినా పెద్దగా ప్రభావం ఉండదంటున్న నిపుణులు.

రష్యా చమురు ఆపేస్తే భారత్‌కు నష్టమా..?
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా నుంచి చమురు కొనే దేశాలపై 500 శాతం వరకు సుంకాలు వేయాలనే అమెరికా ప్రతిపాదనల నేపథ్యంలో.. భారత ఆయిల్ రంగంపై ఒత్తిడి పెరిగింది. దేశానికి అవసరమైన ఆయిల్‌లో 85 శాతం భారత్ దిగుమతి చేసుకుంటుంది. అంటే స్వయంగా దేశంలో కేవలం 15 శాతం మాత్రమే చమురు లభిస్తోందన్నమాట. అలాగే మనకు అత్యధికంగా చమురు ఎగుమతి చేసే దేశం రష్యా. ఆ దేశం నుంచి భారత్ 35 శాతం ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. దీని వల్ల ఇప్పటికే భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధిస్తోంది. అయినా సరే రష్యా ఇస్తున్న డిస్కౌంట్ కారణంగా మనం ఆయిల్ కొంటూనే ఉన్నాం. ఇప్పుడు సుంకాలను 500 శాతం పెంచుతామని అమెరికా అనడంతో రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందేమో? అనే అనుమానాలు నెలకొన్నాయి.

రష్యా భారీ డిస్కౌంట్లు

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత ఆ దేశంపై యూరప్, యూఎస్ భారీగా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో తమ చమురును భారీ డిస్కౌంట్ ధరలను రష్యా అమ్మింది. ఈ అవకాశాన్ని చైనా, భారత్, తుర్కియే వంటి దేశాల సద్వినియోగం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే అంతకుముందు కేవలం 10 శాతం చమురును మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకున్న భారత్.. 38 శాతం చమురును ఆ దేశం నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఇది 35 శాతానికి తగ్గినా.. గతేడాది రష్యా నుంచి ప్రతిరోజూ సుమారు 17 లక్షల బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనుగోలు చేసింది. వీటిలో ప్రతి బ్యారెల్‌పై మార్కెట్ ధర కంటే 4-6 డాలర్లు డిస్కౌంట్ లభించింది. దీంతో ఏడాదిలో సుమా 3-4 బిలియన్ డాలర్లు భారత్‌కు ఆదా అయింది. అంతకుముందు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగినప్పుడు ప్రతి బ్యారెల్‌పై 10-15 డాలర్ల డిస్కౌంట్ ఇచ్చింది రష్యా. గత నవంబరు లెక్కలు చూస్తే.. రష్యా నుంచి ప్రతి టన్నుకు 482.7 డాలర్లు చెల్లిస్తే.. యూఎస్‌ నుంచి కొన్న ప్రతి టన్నుకు 523.3 డాలర్లు చెల్లించాం. అంటే యూఎస్‌తో పోలిస్తే రష్యా నుంచి కొనే చమురు ప్రతి టన్ను సుమారు 41 డాలర్లు తక్కువకు వచ్చిందన్నమాట.

ఏటా 11 బిలియన్ డాలర్ల భారం

గత నవంబరులో సగటున టన్నుకు 498.7 డాలర్లు ఖర్చు చేసింది. అంటే అమెరికాకు సగటు ధర కన్నా 24.6 డాలర్లు అధికంగా చెల్లించిందన్నమాట. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గాయి. ఇటీవలి కాలంలో బ్యారెల్ ధర 60 డాలర్లకు దగ్గరలోనే ఉంటోంది. దీంతో రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. చమురు ధరలు తగ్గడం, పడిపోతున్న రూపాయి విలువ, తరుగుదల వంటి కారణాల వల్ల రష్యా డిస్కౌంట్లు అంత లాభసాటిగా ఉండబోవని విశ్లేషకుల మాట. ఇలాంటి సమయంలో యూఎస్ భారీగా పెంచితే.. భారత చమురు బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడే చాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్ పక్కనపెడితే.. అమెరికా సుంకాల వల్ల 150 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత చమురు బడ్జెట్‌పై కనీసం 9-11 బిలియన్ డాలర్ల భారం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే భవిష్యత్తులో మళ్లీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే రష్యా డిస్కౌంట్లు కీలకంగా మారతాయని వివరించారు.

అంతర్జాతీయ షాక్‌లు తట్టుకోగలమా?

అంతకుముందు మిడిల్ ఈస్ట్‌పై చమురు కోసం ఎక్కువగా ఆధారపడిన భారత్.. 2021 తర్వాత చమురు కొనే దేశాల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. గతంలో సుమారు 28 దేశాల నుంచి చమురు కొనుగోళ్లు చేసిన మనం.. ఇప్పుడు 40పైగా దేశాల నుంచి చమురు కొంటున్నాం. కాబట్టి అంతర్జాతీయంగా చమురు సప్లయ్‌లో ఏమైనా అంతరాయాలు వచ్చినా, సడెన్‌గా ఒక్కడి నుంచైనా చమురు ఎగుమతులు ఆగిపోయినా, ఆపేయాల్సి వచ్చినా భారత చమురు మార్కెట్ తట్టుకోగలిగిన పరిస్థితిలోనే కనిపిస్తోంది. ఒకవేళ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో మరింత తగ్గించుకున్నా.. మిగతా దేశాల నుంచి దిగుమతులను స్వల్పంగా పెంచుకొని ఆ లోటును భర్తీ చేసుకోవచ్చు. దీని వల్ల భారత్‌పై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అలాగే యూఎస్‌ నుంచి కూడా ఆయిల్ దిగుమతులను భారత్ భారీగా పెంచుకుంది. అక్కడి నుంచి వచ్చే హైక్వాలిటీ చమురు వల్ల భారత రిఫైనరీలపై భారం తగ్గుతుంది. కాబట్టి దీని ప్రభావం మార్కెట్‌పై కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అదే సమయంలో రష్యా, వెనిజులా వంటి దేశాల నుంచి వచ్చే హెవీ క్రూడ్‌ను కూడా శుద్ధిచేయగలిగేలా మన దేశంలోని ఆయిల్ రిఫైనరీలు సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. ఇప్పుడు ఏ ప్రాంతం నుంచి వచ్చే చమురునైనా మనం శుద్ధి చేసుకోగలం. ఇలా భారత చమురు వ్యవస్థ ప్రస్తుతం సమతూకంతో ఉందని, అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా తట్టుకోగలదని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం దేశానికి 10 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలే మన దగ్గర ఉన్నాయని, వీటిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

భారత్ ఫ్యూచర్ ప్లాన్

ఈ క్రమంలోనే తాము క్లీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తున్నామని కేంద్రం అంటోంది. సహజ వాయువు వినియోగం, రిఫైనరీల సామర్థ్యాన్ని పెంచడం, దేశీయంగా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తిని పెంచడాన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నట్లు వివరించింది. అలాగే బయో సీఎన్‌జీ, బయోడీజిల్, గ్రీన్ హైడ్రోజన్, ఈవీల వినియోగాన్ని మార్కెట్లో పెంచేందుకు కృషి చేస్తోంది. ఇలాంటి మార్గాల ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుుక భారత్ ప్రయత్నిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అదే సమయంలో దేశంలో ఉన్న ఆయిల నిల్వలను మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ల్యాండ్ అక్విజిషన్ వంటి పనులు సాగుతున్నాయని తెలిపింది.

Next Story