విమాన ప్రమాదం.. పూర్తి కానీ మాజీ సీఎం విజయ్ రూపానీ డీఎన్ఏ టెస్ట్.. కొనసాగుతున్న మృతదేహాల అప్పగింత

by Ramesh Naini |

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఘటనలో ఇప్పటిదాకా 31 మంది మృతుల డీఎన్‌ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్‌ ప్రభుత్వ వైద్యుడు ఆదివారం వెల్లడించారు.

విమాన ప్రమాదం.. పూర్తి కానీ మాజీ సీఎం విజయ్ రూపానీ డీఎన్ఏ టెస్ట్.. కొనసాగుతున్న మృతదేహాల అప్పగింత
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం (Air India plane crash) ఘటనలో ఇప్పటిదాకా 31 మంది మృతుల డీఎన్‌ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్‌ ప్రభుత్వ వైద్యుడు ఆదివారం వెల్లడించారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో 274 మంది చనిపోగా.. మృతదేహాలు మాత్రం గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో మృత దేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ (DNA tests) ప్రక్రియ చేపట్టారు. మృతదేహాల గుర్తింపు కోసం 36 మంది నిపుణులు ఏర్పాటు చేశారు. మృత దేహాలను అప్పగించడం దగ్గర నుంచి ఈ ప్రక్రియలో దాదాపు 600 మంది వైద్యులు, సిబ్బంది, డ్రైవర్లను నియమించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు డీఎన్ఏ గుర్తించిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డీఎన్ఏ సరిపోలిక ప్రక్రియ కొనసాగుతోందని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ తెలిపారు.

ఇప్పటి వరకు 31 మంది డీఎన్ఏల మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. 12 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా డీఎన్‌ఏ పరీక్షతో పనిలేకుండా గుర్తుపట్టిన మృతదేహాలను ఇప్పటికే వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. వీలైనంత వరకు మిగతా మృతుల డీఎన్‌ఏను గుర్తించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, మాజీ సీఎం విజయ్ రూపానీ (former CM Vijay Rupani) డీఎన్ఏ పరీక్ష ఇంకా పూర్తి కాలేదని వర్గాలు తెలిపాయి. ఇది పూర్తి అయిన వెంటనే మృతదేహాన్ని చార్టర్డ్ విమానంలో రాజ్‌కోట్‌కు తరలించనున్నారు. ఆయన అంతిమ యాత్ర రాజ్‌కోట్‌లోని ప్రకాశ్ సొసైటీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమై, కోటేచా చౌక్, కలవాడ్ రోడ్ అండర్‌పాస్, ఆస్ట్రాన్ చౌక్, యాగ్నిక్ రోడ్, డీహెచ్ కాలేజ్, మాలవ్య చౌక్, కార్పొరేషన్ చౌక్, సంగన్వా చౌక్, ప్యాలెస్ రోడ్, రామ్‌నాథ్ పారా మీదుగా శ్మశానవాటికకు చేరుకుంటుంది.

Next Story