సర్టిఫికెట్ల పంపిణీలో అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే కీచులాట! వేదికపైనే కలబడి తిట్టుకున్న నేతలు

by Ramesh Naini |

ప్రభుత్వ కార్యక్రమంలో ఇద్దరు అధికార పార్టీకి చెందిన నేతలు వేదికపైనే సర్టిఫికెట్ల పంపిణీ విషయంలో కీచులాడుకున్నారు.

సర్టిఫికెట్ల పంపిణీలో అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే కీచులాట! వేదికపైనే కలబడి తిట్టుకున్న నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (viral) ప్రభుత్వ కార్యక్రమంలో ఇద్దరు అధికార పార్టీకి చెందిన నేతలు వేదికపైనే సర్టిఫికెట్ల పంపిణీ విషయంలో కీచులాడుకున్నారు. అయితే ఘర్షణ పడింది చిన్న స్థాయి నేతలు కాదు.. అందులో ఒకరు ఎంపీ.. ఇంకొకరు ఎమ్మెల్యే. లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయకుండా అధికారులు, ప్రజల ముందు వేదికపైనే బహిరంగంగా బూతులు తిట్టుకుంటూ రెచ్చిపోయారు. పరువు పోతుందని పట్టింపు లేకుండా వారు కలబడి కొట్టుకునే వరకు వెళ్లారు. వెంటనే అధికారులు, పోలీసులు జోక్యం చేసుకోని వారిని శాంతింపజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో (Tamil Nadu) ‘నలం కాకమ్ స్టాలిన్’ (Nalam Kaakum Stalin) అనే ఆరోగ్య పథకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులకు ఆరోగ్య పథకం సర్టిఫికెట్లను పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు లబ్దిదారులకు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు.

వైరల్ వీడియోలో కన్పిస్తున్న ప్రకారం.. తేని జిల్లాలో సైతం ఆరోగ్య పథకం కార్యక్రమం నిర్వహించారు. దీనికి ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీకి చెందిన ఎంపీ తమిళ్ సెల్వన్ (DMK MP Thanga Tamizhselvan), ఎమ్మెల్యే మహారాజన్ (MLA Maharajan) హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే మహారాజన్ ఓ సర్టిఫికేట్‌ను లబ్ధిదారుడికి అందజేశారు. అనంతరం ఇంకొక సిర్టిఫికెట్‌ను కూడా ఎమ్మెల్యేనే ఇచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ సర్టిఫికెట్‌ను ఎంపీ తమిళ్ సెల్వన్ ఎమ్మెల్యే నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్యే మాత్రం ఎంపీకి సర్టిఫికెట్ ఇవ్వకుండా.. తానే మరో లబ్ధిదారుడికి అందజేశారు. దీంతో మరింత అసహనానికి లోనైన ఎంపీ ఆ సర్టిఫికెట్ లాగేసుకుని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగుతారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. వెంటనే అక్కడున్న అధికారులు, పోలీసులు వారిని కంట్రోల్‌కి తెచ్చారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Next Story