ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గంలో డీఎంకే గెలుపు

by Ajay Maddhiboyina |

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కీపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాది పార్టీకి చెందిన అజిత్ ప్రసాద్‌పై 61,700 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గంలో డీఎంకే గెలుపు
X

- 90 వేలకు పైగా మెజార్టీతో వీసీ చందిరకుమార్ విజయం

- యూపీలోని మిల్కీపూర్‌లో బీజేపీ ఘనవిజయం

దిశ, నేషనల్ బ్యూరో:

తమిళనాడులోని ఈరోడ్(ఈస్ట్) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో అధికార డీఎంకే పార్టీ అభ్యర్థి వీసీ చందిరకుమార్ విజయం సాధించారు. ఈరోడ్ (ఈస్ట్) సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇలంగోవన్ గతేడాది డిసెంబర్‌లో మరణించారు. దీంతో ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గానికి ఉపఎన్నిక తప్పనిసరైంది. కాగా, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఏఐడీఎంకే, బీజేపీ, విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలు ఈ ఉపఎన్నికను బహిష్కరించాయి. అయితే నామ్ తమిళర్ కచ్చి, భారతీయ ప్రజా ఐక్యతా పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా పోటీ చేశారు. మొదటి నుంచి డీఎంకే అభ్యర్థి చందిరకుమార్ పూర్తి ఆధిక్యత ప్రదర్శించారు. తన సమీప ప్రత్యర్థి ఎన్‌టీకేకు చెందిన ఎంకే సీతాలక్ష్మీ‌పై 90 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. చందిరకుమార్ గతంలో ఇదే నియోజకవర్గం నుంచి డీఎండీకే పార్టీ ఎమ్మెల్యేగా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరుప్పూర్ నుంచి ఎన్‌టీకే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా డీఎంకేలో చేరి ఈరోడ్(ఈస్ట్) ఎమ్మెల్యేగా ఉపఎన్నికలో విజయం సాధించారు.

ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కీపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాది పార్టీకి చెందిన అజిత్ ప్రసాద్‌పై 61,700 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చంద్రభాను 1,46,397 ఓట్లు సాధించగా, అజిత్ ప్రసాద్‌కు 61,700 ఓట్లు మాత్రమే వచ్చాయి. మిల్కీపూర్ సిట్టింగ్ ఎస్పీ ఎమ్మెల్యే అవదేశ్ పాసి సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ (అయోధ్య) లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. దీంతో మిల్కీపూర్‌కు ఉపఎన్నిక తప్పలేదు. మిల్కీపూర్ నుంచి ఎస్పీ అభ్యర్థిగా అవదేశ్ పాసి కుమారుడు అజిత్ ప్రసాద్‌ను బరిలో దించారు. తన తండ్రి సిట్టింగ్ స్థానాన్ని నిలబెడతాడని భావించినా.. బీజేపీ ఈ ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. చివరకు బీజేపీ 61 వేలకు పైగా తేడాతో విజయం సాధించి.. ఎస్పీ సిట్టింగ్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

Next Story