Dk Suresh: డీకే శివకుమార్ సోదరుడికి ఈడీ సమన్లు.. కారణమిదే?

by B.Srinivas |

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.

Dk Suresh: డీకే శివకుమార్ సోదరుడికి ఈడీ సమన్లు.. కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Dk shiva kumar) సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్‌ (Dk suresh) కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ సమన్లు పంపించగా ఈ నెల 19న ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సురేశ్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్టు తెలిపాయి. బంగారం, నగదు, బ్యాంకు డిపాజిట్లపై అధిక రాబడి ఇస్తామని ఆశ చూపి ప్రజలను మోసం చేసిన కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణితో పాటు, ఐశ్వర్య గౌడ అనే మహిళను ఈడీ గతంలో విచారించింది.

వారి ఇళ్లలో తనిఖీలు చేసి డిజిటల్ ఆధారాలు, లాండరింగ్ కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, రూ.2.25 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అనంతరం ఐశ్వర్యను అరెస్ట్ చేసింది. అయితే ఆ మహిళకు అనేక మంది రాజకీయ నాయకులతో పరిచయాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంలో డీకే సురేశ్ పేరును ఐశ్వర్య దుర్వినియోగం చేసిందని, తాను సురేశ్ సోదరినిని చెప్పినట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయంపై సురేశ్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో మనీలాండరింగ్ కేసుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సురేశ్‌ను సైతం విచారించాలని ఈడీ నిర్ణయం తీసుకుంది.

Next Story