- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరాడంబరంగా DK శివకుమార్ ప్రమాణ స్వీకారం.. కారణమిదే!
కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కర్ణాటక సీఎల్పీ నేతగా.. డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను పరమేశ్వర బలపరిచారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతు తెలపడంతో ఆయనే సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో.. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శనివారం బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో, అధిష్ఠానం ఆదేశాల మేరకు డీకే శివకుమార్ బాధ్యతలను చేపట్టబోతున్నారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో ఉన్న గ్లాస్ హౌస్‌లో జూన్ 3వ తేదీన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా జరగనుందని జీసీ చంద్రశేఖర్ తెలిపారు. తొలుత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు, కార్యకర్తల కోసం భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ, నగరంలో ట్రాఫిక్ సమస్యలు, ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆర్బాటాలకు పోకుండా కేవలం సేవా స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈ వేడుకను సరళంగా నిర్వహించనున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బెంగళూరుకు తరలివచ్చి ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని చంద్రశేఖర్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీకే శివకుమార్ స్వయంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో పర్యటించి ప్రజల, కార్యకర్తల ఆశీస్సులు తీసుకుంటారని ఆయన వెల్లడించారు. శివకుమార్‌తో పాటు మరికొందరు మంత్రులు కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళం సీఎం సతీశన్, సహా కాంగ్రెస్ పెద్దలు హాజరు కానున్నారు.






