భర్తతో విడాకులు.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపేసిన తల్లి

by Yella Dhawani Reddy |

భర్తతో విడాకులు తీసుకున్న ఓ మహిళ తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసిన ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భర్తతో విడాకులు.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపేసిన తల్లి
X

దిశ, వెబ్ డెస్క్: ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసిన ఘటన మహారాష్ట్ర (Maharasta) రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. థానే (Thane) జిల్లా షాపూర్ తాలుకాలోని అస్నోలి గ్రామంలో సంధ్యా సందీప్ బెరే అనే 27 ఏళ్ల వివాహిత భర్తతో విడాకులు తీసుకుని ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది. అయితే, జులై 20న ఆమె 5, 8, 10 ఏళ్ల వయస్సున్న కుమార్తెలకు అన్నంలో పురుగుల మందు కలిపి తినిపించింది. ఆ తర్వాత పిల్లలకు విపరీతంగా వాంతులు అవ్వటంతో కుటుంబసభ్యులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరిని ముంబైకి, ఒకరిని నాసిక్‌కి తరలించారు. జులై 24, 25 తేదీల్లో ముగ్గురు పిల్లలు మృతిచెందారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత పిల్లలది ప్రమాదవశాత్తు మరణాలుగా భావించారు. అయితే, శనివారం రాత్రి వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో పిల్లల శరీరంలో పూర్తిగా విషం ఉన్నట్లు తేలడంతో పోలీసులు సైతం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తల్లి సంధ్యాను ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అరెస్ట్ చేసి, విచారించగా నేరం అంగీకరించినట్లు సమాచారం. సంధ్య భర్త మద్యపానానికి అలవాటు పడటంతో విడిపోయి ఒంటరిగా ముగ్గురు పిల్లలతో నివసిస్తోంది. ఈ క్రమంలో కుటుంబపోషణ భారంగా మారటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story